Rat Poison on Bananas: కొనే పండ్లపై విషం..ముంబైలో బయటపడ్డ భయంకరమైన ఉదంతం..!

Rat Poison on Bananas: అరటిపండ్లపై ఎలుకల మందు పూసి విక్రయం.. ముంబై మార్కెట్‌లో షాకింగ్ ఘటన బయటపడింది

Update: 2026-02-26 06:52 GMT

Rat Poison on Bananas: కొనే పండ్లపై విషం..ముంబైలో బయటపడ్డ భయంకరమైన ఉదంతం..!

Rat Poison on Bananas: మనం ఆరోగ్యంగా ఉండాలని మార్కెట్‌కు వెళ్లి రంగురంగుల పండ్లను కొనుగోలు చేస్తాం. కానీ, అదే పండ్లు మన పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయంటే నమ్ముతారా? తాజాగా ముంబైలోని మలాద్ వెస్ట్ (రాజన్‌పాడ) ప్రాంతంలో వెలుగుచూసిన ఒక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను వణికించడమే కాకుండా, ప్రజల ప్రాణాలతో విక్రేతలు ఎలా ఆడుకుంటున్నారో కళ్లకు కట్టింది.

రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసే ఇద్దరు వ్యక్తులు.. తాము అమ్మే అరటిపండ్లకు ఏదో పదార్థాన్ని పూస్తూ కెమెరాకు చిక్కారు. మొదట అది పండ్లు త్వరగా పండటానికి వేసే రసాయనం అనుకున్నారు. కానీ అసలు నిజం తెలిశాక పోలీసులు సైతం విస్తుపోయారు. వారు పూస్తున్నది మరేదో కాదు.. అత్యంత విషపూరితమైన రాటోల్ అనే ఎలుకల మందు.

మలాడ్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులు మనోజ్ సంగమ్‌లాల్ కేసర్వానీ (42), రాహుల్ సదన్‌లాల్ కేసర్వానీ (25)లను అదుపులోకి తీసుకున్నారు. వారి స్టాల్‌ను తనిఖీ చేయగా అక్కడ పసుపు భాస్వరం కలిగిన ప్రమాదకరమైన ఎలుకల మందు డబ్బాలు బయటపడ్డాయి.

విచారణలో ఆ వ్యాపారులు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలగక మానదు. రాత్రిపూట పండ్ల గెలలను ఎలుకలు కొరకకుండా ఉండేందుకే తాము ఆ మందును పూస్తున్నామని వారు సమర్థించుకున్నారు. అయితే, ఎలుకల కోసం వాడే విషం మనుషుల కడుపులోకి వెళ్తే పరిస్థితి ఏంటన్న కనీస ఇంగితజ్ఞానం కూడా లేకపోవడం గమనార్హం. తినదగిన వస్తువులపై ఇటువంటి విషపూరిత రసాయనాలు వాడటం వల్ల కలిగే నష్టాలు అపారం.వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. మోతాదు పెరిగితే క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం ఆ ఇద్దరు విక్రేతలపై భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి, కటకటాల్లోకి నెట్టారు. కానీ, ఇలాంటి ఘటనలు ఒక్క ముంబైకే పరిమితం కాదు. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఇలాంటి వ్యాపారుల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

పండ్లు కొనేముందు వాటిపై అసాధారణమైన మచ్చలు లేదా పూతలు ఉన్నాయేమో గమనించండి. వీలైనంత వరకు నమ్మకమైన విక్రేతల వద్దే కొనుగోలు చేయండి. ఆహార భద్రతా అధికారులు కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




Tags:    

Similar News