Air Ambulance Crash: జార్ఖండ్‌లో ఘోరం..అడవిలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్, ఏడుగురు దుర్మరణం

Air Ambulance Crash: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం జరిగింది. చత్రా జిల్లాలోని సిమ్రియా అటవీ ప్రాంతంలో ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది.

Update: 2026-02-24 01:56 GMT

Air Ambulance Crash: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం జరిగింది. చత్రా జిల్లాలోని సిమ్రియా అటవీ ప్రాంతంలో ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఒక డాక్టర్, ఒక పారామెడికల్ సిబ్బందితో పాటు ఇద్దరు సహాయకులు ఉన్నారు. చత్రా జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ఈ విషాద వార్తను ధ్రువీకరించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పాటు వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ప్రమాదానికి గురైన విమానం రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ B90L మెడికల్ చార్టర్ ఫ్లైట్. సోమవారం సాయంత్రం 7:11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి ఈ ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వారణాసికి ఆగ్నేయ దిశలో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా, రాత్రి 7:34 గంటల ప్రాంతంలో కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఘోర ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్లకు దారి కనిపించక ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. విమానంలో కెప్టెన్ వివేక్ వికాస్ భగత్ (పైలట్), కెప్టెన్ సబ్రాజ్‌దీప్ సింగ్ (కో-పైలట్)తో పాటు రోగి సంజయ్ కుమార్, ఆయన బంధువులు అర్చన దేవి, ధురూ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడికల్ స్టాఫ్ సచిన్ కుమార్ మిశ్రా ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందాన్ని ఘటనా స్థలానికి పంపించింది. విమానం కూలిన ప్రదేశం దట్టమైన చెట్లతో కూడిన కొండ ప్రాంతం కావడంతో రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే అసలు ఏం జరిగిందనేది వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News