AI Summit: ఢిల్లీ ఏఐ సదస్సులో గందరగోళం సృష్టించిన యువ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

ఢిల్లీ కృత్రిమ మేధస్సు సదస్సులో నిరసన గందరగోళం సృష్టించిన ఘటనలో యువ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2026-02-24 06:29 GMT

AI Summit: ఢిల్లీ ఏఐ సదస్సులో గందరగోళం సృష్టించిన యువ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

AI Summit: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సులో గందరగోళం సృష్టించిన ఘటనలో జాతీయ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో కృత్రిమ మేధస్సు సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు సహా పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, నాయకులు హాజరైనట్లు సమాచారం.

సదస్సు జరుగుతున్న సమయంలో ఉదయ్ భాను ఆధ్వర్యంలో కొందరు యువకులు కార్యక్రమ ప్రాంగణంలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శన చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేస్తూ పలు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో ఉదయ్ భాను ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.

ఇటీవల నేపాల్‌లో జరిగిన నిరసనల నుంచి ప్రేరణ పొందినట్లుగా ఈ చర్య చేపట్టినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనను పలు రాజకీయ పార్టీలు ఖండించినట్లు సమాచారం.



Tags:    

Similar News