తుక్కులో వెళ్ళిన 10 తులాల బంగారం..
హరియాణాలోని ఫరీదాబాద్‌లో అరుదైన ఘటన వెలుగు చూసింది. తుక్కు సామాన్లలో పొరపాటున వెళ్ళిపోయిన 10 తులాల బంగారాన్ని తుక్కు వ్యాపారి హాజీ అఖ్తర్‌ఖాన్ తిరిగి యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఏసీపీ సమక్షంలో జరిగిన ఈ అప్పగింత వివరాలు మీకోసం.
కలియుగంలో రూపాయి కోసం మనుషులు ప్రాణాలు తీస్తున్న రోజులివి. అలాంటిది కళ్లముందు పది తులాల బంగారం కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? కానీ, హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఒక తుక్కు వ్యాపారి మాత్రం తన నిజాయితీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. పొరపాటున తుక్కు సామాన్లలో వెళ్ళిపోయిన భారీ బంగారాన్ని తిరిగి యజమానికి అప్పగించి అరుదైన ఉదాహరణగా నిలిచారు.
అసలేం జరిగింది?
ఫరీదాబాద్‌కు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ అశోక్ శర్మ కుటుంబం గతేడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లారు. వెళ్లే ముందు ఇంట్లోని 10 తులాల బంగారాన్ని భద్రత కోసం ఒక పాత సంచిలో పెట్టి, దానిని ఇంట్లోని తుక్కు సామాన్ల మధ్య దాచారు. యాత్ర ముగించుకుని వచ్చాక ఆ విషయం మర్చిపోయారు. కొద్ది నెలల క్రితం ఇల్లు శుభ్రం చేసే క్రమంలో, ఆ పాత సంచితో సహా సామాన్లన్నింటినీ తుక్కు వ్యాపారి హాజీ అఖ్తర్‌ఖాన్‌కు విక్రయించారు.
దీపావళి వేళ వెలుగు చూసిన నిజం
పండగ సమయంలో నగలు తీయాలని చూసిన శర్మ కుటుంబానికి అసలు విషయం గుర్తొచ్చి గుండె ఆగినంత పనైంది. వెంటనే అఖ్తర్‌ఖాన్ వద్దకు వెళ్లి ఆరా తీశారు. అప్పట్లో తనకు అలాంటిదేమీ దొరకలేదని ఆయన చెప్పారు. దీంతో నగలు పోయినట్లేనని శర్మ కుటుంబం నిరాశ చెందింది.
అశోక్ శర్మ వెళ్లిపోయినప్పటికీ, అఖ్తర్‌ఖాన్ తన గిడ్డంగిలోని పాత సామాన్లను ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తూనే ఉన్నారు. సుమారు నాలుగు నెలల నిరీక్షణ తర్వాత, అనుకోకుండా ఆ నగల సంచి ఆయన కంటపడింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అశోక్ శర్మకు సమాచారం అందించారు.
నగర ఏసీపీ జితేశ్ మల్హోత్ర సమక్షంలో శుక్రవారం నాడు అఖ్తర్‌ఖాన్ ఆ 10 తులాల బంగారాన్ని అశోక్ శర్మ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ శర్మ భావోద్వేగానికి గురవుతూ "ఖాన్ సాబ్ చేసిన మేలు జన్మలో మర్చిపోలేను" అని కొనియాడారు. దీనికి స్పందించిన అఖ్తర్‌ఖాన్, "ఇది ఇతరుల సొత్తు, నాకు తెలియకుండా నా వద్ద ఉంది. తెలిశాక తిరిగి ఇవ్వడం నా కనీస బాధ్యత" అని వినమ్రంగా చెప్పారు.