అయ్య బాబోయ్.. వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేసిన హోటళ్లు.. ఈ లెక్కలు తెలిస్తే గుండె జారిపోతుంది!

దేశవ్యాప్తంగా హోటల్ యజమానులు వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. హైదరాబాద్ ల్యాబ్‌లో జరిగిన విచారణలో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Update: 2026-02-20 04:30 GMT

హోటల్ పరిశ్రమలో భారీ పన్ను ఎగవేత స్కామ్ వెలుగులోకి 

పన్నుల ఎగవేత సర్వసాధారణమైన విషయం. దాదాపుగా అన్ని పరిశ్రమలోనూ పన్ను ఎలా ఎగవేయాలా అనే ఆలోచనలు జరుగుతూనే ఉంటాయనేది బహిరంగ రహస్యం. అయితే, ఆర్టిఫ్షియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చాకా ఇది మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. హోటల్ పరిశ్రమలో వేలాది కోట్ల రూపాయల పన్నుల ఎగవేతకు సంబంధించిన మోసం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ పరిశ్రమలో సుమారు రూ. 70,000 కోట్ల మేర భారీ పన్ను మోసం జరిగినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా హోటల్ యజమానులు కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ఫోరెన్సిక్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి తమ బిల్లింగ్ డేటాను తారుమారు చేసినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లోని ఐటీ డిజిటల్ ల్యాబ్‌లో నిర్వహించిన కీలకమైన తనిఖీల్లో ద్వారా ఈ అక్రమ లావాదేవీల గుట్టు రట్టయింది.

గడిచిన ఆరేళ్లుగా, అంటే 2019 నుండి 2026 వరకు ఉన్న బిల్లింగ్ రికార్డులను పరిశీలించగా ఈ మోసం బయటపడింది. కస్టమర్ల నుండి వసూలు చేసిన అసలు ఆదాయాన్ని దాచిపెట్టి, ప్రభుత్వానికి తక్కువ ఆదాయం చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా హోటళ్లు భాగస్వామ్యం వహించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఐటీ శాఖ సమాచారం ప్రకారం, ఈ పన్ను మోసం జాబితాలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన బిల్లింగ్ డేటాను రికార్డుల నుండి తొలగించినట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం అధికంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 1,500 కోట్లు, తమిళనాడులో రూ. 1,200 కోట్ల మేర డేటా మాయమైనట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.

మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా ఎదిగిన రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్లు సమాచారం. హోటల్ సాఫ్ట్‌వేర్‌లలో ప్రత్యేకంగా మార్పులు చేసి, రోజువారీ వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని లెక్కల్లో చూపకుండా ‘డిలీట్’ చేసే సాంకేతికతను వీరు అనుసరించారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడింది.

ఈ భారీ కుంభకోణాన్ని ఛేదించడానికి ఐటీ విభాగం అత్యాధునిక ఏఐ (Artificial Intelligence) టెక్నాలజీని ఉపయోగించింది. సాధారణ తనిఖీల్లో దొరకని ఈ డిజిటల్ ఆధారాలను, క్లౌడ్ స్టోరేజ్, సర్వర్ల డేటాను విశ్లేషించడం ద్వారా అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంబంధిత హోటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. రికార్డుల తారుమారుకు సహకరించిన సాఫ్ట్‌వేర్ సంస్థల పైన కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ పన్ను మోసం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు భారీగా జరిమానాలు విధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News