తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: సీఎం స్టాలిన్‌తో ఓ. పన్నీర్‌సెల్వం భేటీ.. డీఎంకే గూటికి మాజీ సీఎం?
O Panneerselvam: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (2026) సమీపిస్తున్న వేళ అగ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
O Panneerselvam: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (2026) సమీపిస్తున్న వేళ అగ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే (AIADMK) బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం అలియాస్ ఓపీఎస్.. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను అసెంబ్లీ ప్రాంగణంలో స్వయంగా కలుసుకోవడం పెను సంచలనానికి దారితీసింది.
తమిళనాడు అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రులు తంగం తెన్నరసు, ఎంఆర్‌కె పన్నీర్‌సెల్వం సమాధానమిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే, దీనికి భిన్నంగా ఓపీఎస్ మాత్రం స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని ప్రశంసలు కురిపించారు.
బడ్జెట్ చర్చ అనంతరం ఓపీఎస్ - స్టాలిన్ సుమారు కొన్ని నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుతానికి ఓపీఎస్ మద్దతుదారులు ఒక్కొక్కరుగా ఆయనను వీడి ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గంలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఒంటరి అవుతున్న పన్నీర్‌సెల్వం తన రాజకీయ భవిష్యత్తు కోసం డీఎంకే (DMK) తీర్థం పుచ్చుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. మరో ఒకటి రెండు రోజుల్లో ఓపీఎస్ తన భవిష్యత్ కార్యాచరణపై ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన కలిగిస్తుండగా, డీఎంకేకు మాత్రం అదనపు బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.