Subhalagnam: శుభలగ్నం సినిమా సీన్ రిపీట్.. డబ్బు కోసం ఇల్లాలి నిర్వాకం

Subhalagnam: సినిమా తెరపై ఆమని, జగపతిబాబును ఆస్తి కోసం రోజాకు అమ్మేయడం చూసి.. అమ్మో ఇలా కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాం. కానీ, సరిగ్గా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిజంగా జరిగింది.

Update: 2026-02-19 04:05 GMT

Subhalagnam: శుభలగ్నం సినిమా సీన్ రిపీట్.. డబ్బు కోసం ఇల్లాలి నిర్వాకం

Subhalagnam: సినిమా తెరపై ఆమని, జగపతిబాబును ఆస్తి కోసం రోజాకు అమ్మేయడం చూసి.. అమ్మో ఇలా కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాం. కానీ, సరిగ్గా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిజంగా జరిగింది. వెండితెరపై చూసిన 'శుభలగ్నం' సీన్, ఇప్పుడు మధ్యప్రదేశ్ వీధుల్లో రియల్ లైఫ్ డ్రామాగా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి తన ఆఫీసులోనే పనిచేసే 52 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భార్య, ఇద్దరు కూతుళ్లను అతను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో రోజూ గొడవలు, మనస్పర్థలు.. చివరికి ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కింది. అధికారులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా, నాకు భార్య వద్దు.. ప్రియురాలే ముద్దు అంటూ ఆ భర్త భీష్మించుకు కూర్చున్నాడు.

భర్త మనసు మారదని అర్థం చేసుకున్న ఆ భార్య, ఎమోషన్స్ కంటే తన పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించింది. అక్కడే ఆమె ఒక వినూత్నమైన ప్రతిపాదన పెట్టింది. నా భర్త నీకు కావాలంటే.. మాకు సెటిల్మెంట్ చేయి అంటూ ప్రియురాలి ముందు కఠినమైన షరతులు ఉంచింది.

ఆ డీల్ వివరాలు ఇవే.. ప్రియురాలికి చెందిన ఒక ఖరీదైన డూప్లెక్స్ ఇల్లు.అదనంగా రూ. 27 లక్షల నగదు.వెరసి దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తి ఇవ్వాలని సదరు భార్య డిమాండ్ చేసింది. ఆశ్చర్యకరంగా, ఆ ప్రియురాలు తన ప్రియుడి కోసం ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడలేదు. వెంటనే ఒప్పందానికి ఓకే చెప్పేసింది. కోర్టు సమక్షంలోనే ఈ 'క్రయ విక్రయాల' ఒప్పందం ముగిసింది. ప్రస్తుతం ఆ భార్య తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కొత్త ఇంటికి మారిపోగా, భర్త తన 'కొత్త యజమాని' (ప్రియురాలు) దగ్గరకు చేరిపోయాడు.

ఒకవైపు భర్తను వదులుకున్నా, తన పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించుకున్న ఆ భార్య నిర్ణయంపై నెట్టింట భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆమె ప్రాక్టికల్ ఆలోచనను మెచ్చుకుంటుంటే, మరికొందరు సమాజం ఎటు పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఇది అచ్చంగా కలికాలం శుభలగ్నం.

Tags:    

Similar News