Rajasthan Elections: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్

Rajasthan Elections: రాజస్థాన్‌‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.

Update: 2023-11-25 04:10 GMT

Rajasthan Elections: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్

Rajasthan Elections: రాజస్థాన్‌‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలుండగా.. 199 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది. శ్రీగంగానగర్‌ జిల్లాలోని కరణ్‌పూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ మరణించడంతో అక్కడ పోలింగ్‌ వాయిదా పడింది. 199 నియెజకవర్గాలకు గానూ..1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.

రాజస్థాన్ వ్యాప్తంగా 51 వేల 507 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తంగా 5 కోట్ల 25 లక్షల 38 వేల 105 మంది ఓటర్లు ఉండగా... ఒక వెయ్యి 862 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పలు నియోజకవర్గాల నుంచి183 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సర్దార్‌పురా నుంచి సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పోటీ చేస్తున్నారు. 1998 జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా అశోక్‌ గెహ్లాట్‌ విజయం సాధించారు. అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మహేంద్రసింగ్‌ రాథోడ్‌ బరిలో నిలిచారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌‌లు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్‌లో హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. రాజస్థాన్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాల్లేవు. కానీ ఈ ఆనవాయితీని బద్దలు కొట్టాలని కాంగ్రెస్‌ హైకమాండ్ భావిస్తోంది. బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్‌ పార్టీ భరత్‌పూర్‌ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌‌కు కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఎం, ఆర్‌ఎల్పీ, భారత్‌ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు పోటీకి దిగాయి. పోలింగ్‌ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కాగా డిసెంబర్‌ 3 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News