China in India: చైనా భారత్‌లోనే ఉందని రాహుల్ గాంధీ ఎందుకన్నారు?
Rahul Gandhi aout make in india: ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు రెండు కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానీ మోదీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా గొప్ప ఐడియా అని కితాబిచ్చారు. కానీ ఆ ఐడియాను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 2014 నుండి ఇప్పటివరకు నమోదైన స్థూల జాతీయ ఆదాయంలో తయారీ రంగం వాటా చూస్తే ఆ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్ సభలో మోదీ సర్కారుపై పలు ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"2014 నాటి జీడీపీలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా 15.3% గా ఉంది. తాజా జీడీపీలో అదే తయారీ రంగం వాటా 12.6% గా ఉంది. ఒకవేళ మేక్ ఇన్ ఇండియా నినాదం సక్సెస్ అయితే, జీడీపీలో ఆ రంగం వాటా పెరగాల్సి ఉండేది కదా" అని రాహుల్ గాంధీ మోదీ సర్కారును ప్రశ్నించారు. అంతేకాదు... గత 60 ఏళ్లలో తయారీ రంగం నుండి అతి తక్కువ జాతీయ స్థూల ఆదాయం నమోదవడం కూడా ఇదే అని అన్నారు.
తాను ప్రధాని నరేంద్ర మోదీని నిందించడం లేదని, ఆయన ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారనే చెబుతున్నానన్నారు. మేక్ ఇన్ ఇండియా విఫలమవడంతో ఇండియాలో చైనా ఉత్పత్తులు పెరిగిపోతున్నాయని అన్నారు. చైనా ఉత్పత్తుల రూపంలో ఆ దేశం భారత్‌లోనే ఉందని చెప్పారు. ఇది దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన విషయంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అంతేకాకుండా భారత్ ఇప్పటికీ ఎదగకపోవడానికి కారణం యూపీఏ ప్రభుత్వం కానీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం కానీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగంపైనా రాహుల్ గాంధీ కామెంట్స్
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ప్రసంగంపై రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. రాష్ట్రపతి చదువుతున్న ప్రసంగంపై దృష్టి పెట్టడానికి తాను చాలానే కష్టపడ్డట్లు తెలిపారు. గతేడాది, అంతకు ముందు ఏడాది ఏదైతే చదవారో మళ్లీ అవే పాయింట్స్ చదివి వినిపించినట్లుగా అనిపించిందని, అందుకే తను అయోమయానికి గురయ్యానని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా అనిపించిందని, చెప్పిందే మళ్లీ చెప్పారని అదే రోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏమన్నారు.. బీజేపీ లీడర్లకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఈ వివాదంపై ఎవరేమన్నారంటే...