సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏమన్నారు.. బీజేపీ లీడర్లకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఈ వివాదంపై ఎవరేమన్నారంటే...

Sonia Gandhi about President Droupadi Murmu
x

సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏమన్నారు.. బీజేపీ లీడర్లకు కోపం ఎందుకు వచ్చింది?

Highlights

Sonia Gandhi about President Droupadi Murmu: కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం...

Sonia Gandhi about President Droupadi Murmu: కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆమె ఇంకా ఫ్యూడల్ మనస్వత్వంతోనే మాట్లాడుతున్నారని బీజేపి నేతలు సోనియా గాంధీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోనియా గాంధీ మాట్లాడిన మాటలు రాష్ట్రపతిని కించపరిచేలా ఉన్నాయని కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు. ఇంతకీ బీజేపి నేతలు విమర్శలకు దిగేలా సోనియా గాంధీ ఏమన్నారు?

రాష్ట్రపతి ద్రౌపది ప్రసంగం అనంతరం లోక్ సభ, రాజ్య సభ సభ్యులు అందరూ పార్లమెంట్ నుండి బయటికొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా బయటికొచ్చారు. ఇటీవలె కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో గెలిచి లోక్ సభలో ఎంపీగా అడుగుపెట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా కూడా వారితో పాటే ఉన్నారు.

పార్లమెంట్ సమావేశాల కోసం లైవ్ కవరేజ్ కోసం అక్కడే ఉన్న జర్నలిస్టులు ఈ ముగ్గురు గాంధీలను చుట్టుముట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై మీ అభిప్రాయం ఏంటని సోనియా గాంధీ ముందు మైక్ పెట్టారు.

సోనియా గాంధీ స్పందిస్తూ రాష్ట్రపతి ప్రసంగంలో ఎప్పట్లాగే అబద్ధపు హామీలే ఉన్నాయని అన్నారు. అంతలోనే రాహుల్ గాంధీ కలుగ చేసుకుని, "బోరింగ్" అని అన్నారు. చెప్పడానికంటూ ఏమీ లేదన్నట్లుగా "నో కామెంట్" అని కూడా అన్నారు. చెప్పిందే చెప్పారన్నారు.

మళ్ళీ సోనియా గాంధీ, "పాపం.. ఆమె. ప్రసంగం చివర్లోకొచ్చేటప్పటికీ చాలా అలిసిపోయారు" అని అన్నారు. అంతేకాదు... "ప్రసంగం చివర్లో ఆమె మాట్లాడలేకపోయారు కూడా" అని అభిప్రాయపడ్డారు.

సరిగ్గా ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు బీజేపీ పెద్దలు సోనియాపై యుద్ధం ప్రకటించారు.

సోనియా గాంధీ ఇప్పటికీ ఫ్యూడల్ మనస్తత్వంతోనే దురుసుగా మాట్లాడుతున్నారని బీజేపి నేతలు ఆరోపిస్తున్నారు. ఫ్యూడల్ మైండ్ సైట్ అంటే ఏంటో తెలిసిందే కదా... "పెద్ద మొత్తంలో భూములు, డబ్బు ఉండి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను శాసించే స్థాయిలో ఉండటాన్ని ఫ్యూడల్ మైండ్ సెట్" అని అంటుంటారు. ఇప్పుడు సోనియా గాంధీని కూడా అదే కోవకు చెందిన మహిళ అంటూ బీజేపి నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు క్షమాపణలు చెప్పాలి - జేపి నడ్డా

సోనియా గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా స్పందించారు. తనతో పాటు బీజేపీలోని ప్రతీ ఒక్క కార్యకర్త సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. "సోనియా గాంధీ కావాలని అన్న ఆ మాటలు చూస్తోంటేనే పేదల పట్ల, ఆదివాసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక స్వభావం ఎలాంటిదో అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ బేషరతుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆదివాసీలకు క్షమాపణలు చెప్పాలి" అని జేపి నడ్డా డిమాండ్ చేశారు.

ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధించిన ప్రగతిని ముర్ము వివరించారని నడ్డా అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో అందరూ ఇంతేనా?

మరో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తుందా అని ప్రశ్నించారు. లేదంటే ఆ పార్టీలో అందరూ ఇంతేనా అని జనమే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయితే, ఆమె పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. 55 ఏళ్లకొచ్చిన రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్ అని ఎలా అంటారని నిలదీశారు.

"రాష్ట్రపతి కేంద్రం తరపును ప్రోగ్రెస్ కార్ట్ రిపోర్ట్ చదివి వినిపిస్తున్నారు. మీకు అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సభలో చర్చించాలి కానీ ఇలా రాష్ట్రపతిని అవమానించేలా ఎలా మాట్లాడుతారు" అని హరిదీప్ సింగ్ పురి అన్నారు. హరిదీప్ సింగ్ పురి వ్యాఖ్యలు ఇలా ఉంటే... మరో బీజేపి నేత అమిత్ మాల్వియ్ కూడా సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు అంటే లెక్కలేదా? - అమిత్ మాల్వీయ

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడం ఇదేం మొదటిసారి కాదని బీజేపీ ఐటీ వింగ్ ఇంచార్జి అమిత్ మాల్వియ్ అన్నారు. పదేపదే రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని చూపించే రాహుల్ గాంధీ ఇప్పటివరకు రాష్ట్రపతిని ఒక్కసారైనా కలవాలని ఎందుకు అనుకోలేదని ప్రశ్నించారు.

బీఆర్ అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని అన్నారు. అందుకే దళితులు, ఓబీసీలు, ఆదివాసీల నుండి రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారిపై కూడా కాంగ్రెస్ నేతలకు గౌరవం లేదని అమిత్ మాల్వియ్ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఇలా ఉంటే, ఇక ప్రధాని మోదీ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్రపతికి ప్రధాని మోదీ కితాబు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అద్భుతం అని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. వికసిత్ భారత్ పట్ల, అభివృద్ధి కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల పట్ల రాష్ట్రపతికి స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో మోదీ మాట్లాడారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిషాలోని అడవుల నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడి వరకూ వచ్చారని అన్నారు. "రాష్ట్రపతి మాతృభాష హిందీ కాదు. ఆమె ఒడిషాలోని మారుమూల ప్రాంతం నుండి వచ్చారు. అయినప్పటికీ హిందీలో ప్రసంగం చేశారు" అని మోదీ గుర్తుచేసుకున్నారు.

“అలాంటి రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని రాహుల్ గాంధీ బోరింగ్ అని అన్నారు. సోనియా గాంధీ రాష్ట్రపతిని పూర్ థింగ్ అని అవమానించారు” అని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాటలతో కాంగ్రెస్ పార్టీ 10 కోట్ల మంది ఆదివాసీలను అవమానించిందని విమర్శించారు.

మోదీ ఆరోపణలను తిప్పికొట్టిన మల్లికార్జున ఖర్గే

ప్రధాని మోదీతో పాటు బీజేపి నేతలు చేస్తోన్న వరుస ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే ఖండించారు. రాష్ట్రపతిని మాత్రమే కాదు, ఏ ఒక్క వ్యక్తినీ అవమానించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

ఆమాటకొస్తే, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా ప్రధాని మోదీనే ఆమెను అవమానించారని ఖర్గే విమర్శించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి, రామ్ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా అవమానించారని ఖర్గే అన్నారు.

ఈ వివాదంపై స్పందించిన రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతుండటంతో రాష్ట్రపతి భవన్ కూడా ఈ వివాదంపై స్పందించింది. రాష్ట్రపతి ముర్ము ఏ దశలోనూ అలసిపోలేదని, అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడటాన్ని అలసటగా ఎప్పుడూ భావించరని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.

మా అమ్మ ఉద్దేశం అది కాదు - ప్రియాంక గాంధీ

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపి పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంపై ప్రియాంక గాంధీ స్పందించారు. "మా అమ్మ వయస్సు ఇప్పుడు 78 ఏళ్లు. ఆమెకు రాష్ట్రపతి అంటే చాలా గౌరవం ఉంది. రాష్ట్రపతిని కించపర్చాలనే ఉద్దేశం ఆమెకు లేదు. కానీ అంత సుదీర్ఘమైన ప్రసంగం చదివి చదివి రాష్ట్రపతి అలిసిపోయారు పాపం" అని మాత్రమే అన్నారు. దురదృష్టవశాత్తుగా ఆ వ్యాఖ్యలను మీడియా మరోలా చూపించిందని అన్నారు. పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్సులో ఒక కమిటీ మీటింగ్‌కు హాజరై తిరిగి వెళ్తూ ఆమె ఈ వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories