భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 324కు చేరి మృతుల సంఖ్య 6కు పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఆదివారం జరుగుతున్న జనతా కర్ఫ్యూను రాజస్థాన్ వలె పంజాబ్ ప్రభుత్వం కూడా పొడిగించింది. వైరస్‌ను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు పంజాబ్ ప్రభుత్వం మార్చి 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించింది. ఇక పంజాబ్ లోని జలంధర్, పటియాలా, నవన్‌షహర్, హోషియార్పూర్, సంగ్రూర్ జిల్లాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి బుధవారం అర్ధరాత్రి వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వెల్లడించిన అధికారులు..
అలాగే మార్చి 31 వరకూ కూడా లాక్‌డౌన్ కొనసాగుతుందని ఈ సమయంలో నిత్యావసర సేవలు పొందేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరినే బయటికి వచ్చేందుకు అనుమతిస్తారని అధికారులను ఆదేశించారు. అలాగే నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లాక్‌డౌన్ ను పర్యవేక్షించేందుకు ఓ టాస్క్ ఫోర్స్ టీం ను కూడా ఏర్పాటు చేసింది. వీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు.