Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన

*రైతులకు ఎంతగానో నచ్చజెప్పాం- ప్రధాని మోడీ *దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా- ప్రధాని మోడీ

Update: 2021-11-19 04:40 GMT

ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన(ఫైల్ ఫోటో)

Narendra Modi: నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటన చేస్తామన్నారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

ప్రత్యేక కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు.

అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు.

22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టామని, ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు ఢిల్లీ శివారులో శిబిరాలను ఏర్పాటు చేసుకొని నిరసనలను కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా అప్పట్లో కేంద్రం స్పందించలేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. కానీ ప్రధాని మోదీ అనూహ్యంగా ఇవాళ జాతినుద్దేశించి ప్రసగించి సంచలన ప్రకటన చేశారు.

Full View

కేంద్రం ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతులపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News