Vande Bharat: వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Vande Bharat: తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
Vande Bharat: వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Vande Bharat: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల మధ్య పట్టాలెక్కనుంది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందించేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తోడ్పడనుంది. కేవలం 5 స్టేషన్లలో మాత్రమే హాల్ట్ కలిగి 8:30 గంటల వ్యవధిలో గమ్యస్థానానికి చేరడం వందే భారత్ ప్రత్యేకత.
అత్యంత వేగవంతంగా ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా పరుగులు పెట్టనుంది. సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించి తెలుగు ప్రజలకు అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ నుండి విశాఖ వరకు ఈ వందే భారత్ రైలు నడవనుంది. వందే భారత్ రైలు వారంలో 6 రోజులు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:45 నిమిషాలకు ప్రారంభమై 2:15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకోనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేవలం 8:30 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో ప్రధాన స్టేషన్‌లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్‌లలో హాల్ట్ ఉంటుంది.
ఈ రైలులో 14 ఏసీ చైర్ కార్ కోచ్‌లు, 1128 మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ప్రత్యేకమైన రిజర్వ్‌డ్ సిట్టింగ్ వసతిని కలిగి ఉంటుంది. ఈ రైలు అధికారిక పర్యటనలు, వ్యాపార ప్రయోజనం, తక్కువ వ్యవధిలో పర్యటనలు వంటి అత్యవసర అవసరాలపై ప్రయాణించే ప్రజల అవసరాలకు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వందేభారత్ రైలును రూపొందించారు. మెరుగైన సౌకర్యాలతో కూడిన స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడింది. రైలు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌లను కలిగి ఉంది. 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు అమర్చబడి ఉన్నాయి. అత్యవసర అలారం బటన్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్‌లు ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందితో మాట్లాడవచ్చు. అన్ని కోచ్‌లలో సీసీ కెమెరాలను అమర్చారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రజలకు సురక్షితమైన, అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. ఇతర రవాణా మార్గాలతో పాటు ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చినప్పుడు ఇది వేగవంతమైన ప్రయాణంగా గుర్తింపు పొందింది.