Baisaran-NIA: పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలకంగా మారిన అతని సాక్ష్యం.. NIA దర్యాప్తులో బయటకొస్తున్న సంచలన విషయాలు!
బైసరన్‌లో జరిగిన ఈ దాడి దేశాన్ని షాక్‌కు గురిచేసింది. నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్న కొద్దీ, ఉగ్రవాద మూలాలు, లోకల్ మద్దతుదారుల పాత్రలపై మరింత స్పష్టత వచ్చేస్తోంది.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసరన్ లోయను రక్తపు మైదానంగా మార్చిన ఉగ్రదాడి వెనుక అసలు మిస్టరీ ఒక్కొటీ వెలుగులోకి వస్తోంది. కోకర్ నాగ్ వైపు నుంచి టెర్రరిస్టులు 22 గంటల పాటు కొండలు, అడవులు దాటి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. బైసరన్ మైదానంలో 26 మంది టూరిస్టులను అమానుషంగా హతమార్చిన తర్వాత మళ్లీ అడవుల్లోకి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్థాన్‌కు చెందినవారని సమాచారం. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించిన అధికారుల ప్రకారం, టెర్రరిస్టులు ఏకే-47 రైఫిల్స్, ఎం4 గన్స్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ అనలిసిస్ ద్వారా స్పష్టం అయింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను విశ్లేషిస్తూ, కాల్పుల తీరును NIA అధికారులు అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాల్పులు ప్రారంభమైన వెంటనే చెట్టుపైకి ఎక్కి, మొత్తం ఘటనను కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ కూడా ముందుగా తన కుటుంబాన్ని రక్షించి, తర్వాత టెర్రరిస్టుల అరాచకాన్ని డాక్యుమెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలం కూడా విచారణలో కీలకంగా మారనుంది. మరోవైపు దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సహాయపడినట్టు పోలీసు విచారణలో తేలింది. వీరిలో ఐదుగురిని ప్రధాన అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
టెర్రరిస్టుల ప్రవేశం ఎలా జరిగిందన్న అంశం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నలుగురు టెర్రరిస్టులు అడవుల గుండా వచ్చి, బైసరన్ మైదానంలోని షాపుల వెనక దాక్కున్నారు. టూరిస్టులు గుంపుగా చేరగానే గన్స్‌తో బయటికొచ్చి వారిని కలిమా చదవమని బెదిరించారు. అనంతరం టార్గెట్ చేసిన టూరిస్టులను తలలపై, ఛాతీలపై నిర్దాక్షిణ్యంగా కాల్చారు. మృతదేహాల మధ్య భయంతో పరుగులు తీయాల్సి వచ్చిన క్షణాల్ని ఇంకా గమనించే వీలుకాలేదు. చాలా మంది ప్రాణాలు కోల్పోయినా కొందరు మాత్రం అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు.