Operation Mahadev: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం
Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదులపై విజయవంతంగా మెరుపుదాడి జరిపాయి.
Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదులపై విజయవంతంగా మెరుపుదాడి జరిపాయి. సోమవారం జరిగిన *‘ఆపరేషన్ మహాదేవ్’*లో పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ విషయం సైన్యం ధృవీకరించిందని ఆల్ ఇండియా రేడియో వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
ఉగ్రవాదులు శ్రీనగర్‌కు సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో దాగున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం లభించడంతో భద్రతా దళాలు గత నెల రోజులుగా జల్లెడ పడుతున్నారు. దాచిగామ్ అడవుల్లో అనుమానాస్పద కమ్యూనికేషన్లు గుర్తించడంతో అప్రమత్తమైన సైన్యం, స్థానిక సంచార జాతులచే అందిన సమాచారంతో పాటు, లిడ్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పక్కాగా కూంబింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలో లిడ్వాస్ వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. వీరంతా లష్కరే తయిబాకు చెందినవారుగా గుర్తించబడ్డారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఆపరేషన్ మహాదేవ్ పేరుకు కారణం?
ఈ ఆపరేషన్‌కు ‘మహాదేవ్’ అని పేరు పెట్టడాని వెనుక కారణం – ఇది దాచిగామ్ సమీపంలో ఉన్న మహాదేవ్ పర్వతాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న స్థలం జబర్వన్-మహాదేవ్ పర్వతాల మధ్యలో ఉంది. ఆపరేషన్ మహాదేవ్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టారు.
పహల్గాం దాడి నేపథ్యం:
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక కశ్మీరీ వ్యక్తి మృతి చెందారు. అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ దాడికి లష్కరే తయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించినట్లు గుర్తించారు. వీరిలో ప్రతీ ఒక్కరిపై రూ.20 లక్షల రివార్డు కూడా ప్రకటించబడి ఉంది.
ఈ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. వేగంగా స్పందించి విజయవంతంగా ఉగ్రవాదులను అణచివేయడంలో దళాలు చూపిన నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఈ విజయంతో పహల్గాం దాడికి పాల్పడిన కీలక ఉగ్రవాదుల తొలిదశ ఖతం అయిందని భావిస్తున్నారు. అయితే ఇంకా అనేకమంది ఉగ్రవాదులు లొంగలేదని అధికారులు చెబుతున్నారు.