Corona Second Wave: భారత్‌కు 40 దేశాల సాయం

Corona Second Wave: దాదాపు 40 దేశాలు కోవిడ్ సంబంధిత పరికరాలు, సామాగ్రిని భారత్‌కు పంపించాయని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.

Update: 2021-05-21 04:56 GMT

Ministry of Foreign Affairs 

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా దేశంలో సంభవించిన విపత్కర పరిస్థితులను చూసి భారత్‌కు చేయూతనందించేందుకు చాలా దేశాలు ముందుకొచ్చాయి. వైద్య పరికరాలు, సామాగ్రిని అందించి కష్టకాలంలో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించాయి. అయితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో దాదాపు 40 దేశాలు కోవిడ్ సంబంధిత పరికరాలు, సామాగ్రిని భారత్‌కు పంపించాయని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ ఎగుమతులు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. కోవిడ్‌పై పోరాడుతున్న క్రమంలో చాలా దేశాలు భారత్‌కు సంఘీభావం తెలపడానికి, మద్దతివ్వడానికి ముందుకు వచ్చి సాయం చేశాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా 40 దేశాలు భారత్‌కు కోవిడ్‌పై పోరాడడానికి అవసరమైన సామాగ్రిని, పరికరాలను పంపాయని అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో ఇటీవల ఆక్సిజన్, వైద్య పరికరాలు లేక భారత్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News