ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం

Opposition Parties Meeting: ముఖాముఖి తలపడే అంశంపై చర్చ .సమావేశానికి హాజరుకానున్న రాహుల్, ఖర్గే, సీఎం స్టాలిన్

Update: 2023-06-09 06:07 GMT

ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం

Opposition Parties Meeting: 2024లో 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీని ఓడించాలంటే ద్విముఖ పోరుకు దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. లోక్‌సభ 450 స్థానాలకు ఈ ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాలని విపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఓట్లు చీలకుండా ఉండాలనే లక్షంతోనే ఈ వ్యూహాన్ని ప్రతిపక్షాలు అమలు చేయాలనుకుంటున్నాయి. ఇందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వన్ టు వన్ ఫార్మూలాను ప్రతిపాదించారని తెలిసింది. బీజేపీ ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 23న బీహార్‌లోని పాట్నాలో సమావేశం కానున్నాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఓడించాలన్న అంశంపైనే ఈ నెల 23న పట్నాలో జరిగే విపక్షాల సమావేశం చర్చించనుంది. ప్రధానంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 450 చోట్ల బీజేపీతో కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు ముఖాముఖి తలపడే అవకాశం ఉందని.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా.. ఇక్కడ విపక్షాల నుంచి ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించే అంశంపై ఏకాభిప్రాయం సాధించాలని ఐక్యతాయత్నాల బాధ్యత తీసుకున్న బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ భావిస్తున్నారు.

మమతా బెనర్జీ 2021లో మొదటిసారి ఈ ప్రతిపాదన చేశారు. అప్పట్లో ఏ పార్టీ సానుకూలంగా స్పందించలేదు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని విపక్షాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు నడుంబిగించిన నీతీశ్‌ కూడా ఈ ఆలోచననే ముందుకు తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు దీనిని ఎంతవరకు అంగీకరిస్తాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే బిహార్‌ తప్ప ఉత్తరాదిలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌‌కు మద్దతిస్తుందా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అలాగే బెంగాల్లో పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌కు బీజేపీతో పాటు కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. బీజేపీ ని ఓడించేందుకు ఈ రెండింటితో సీట్ల సర్దుబాటు చేసుకోవడం అసాధ్యమని టీఎంసీ వర్గాలే అంటున్నాయి. ఇలా పరస్పర వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. ఒకే అభ్యర్థి ప్రతిపాదనపై నీతీశ్‌ ఇప్పటికే ఆయా పార్టీలతో పలు మార్లు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. పట్నా భేటీలో దీనికో రూపం రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. నిజానికి ఈ సమావేశం ఈ నెల 12న జరగాల్సి ఉంది. రాహుల్‌ అమెరికా పర్యటనలో ఉండడం.. తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆ రోజు రాలేనని చెప్పడంతో అనివార్యంగా వాయిదాపడింది. ఆయా పార్టీల నేతలతో మాట్లాడిన నితీశ్‌.. చివరకు 23ను ఖరారుచేశారు.

Tags:    

Similar News