Janatha Curfew: జనతా కర్ఫ్యూకి ఏడాది పూర్తి
Janata Curfew: 2020 మార్చి 19న జనతా కర్ఫ్యూకు పిలుపు * 2020 మార్చి 22 ఉదయం 7 నుంచి 14 గంటల కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూ (ఫైల్ ఇమేజ్)
Janata Curfew: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా విధించిన జనతా కర్ఫ్యూకి నేటితో ఏడాది పూర్తైంది. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. కొవిడ్‌ను ఎదుర్కొంటోన్న ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావం ప్రకటించాలన్నారు. సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలపాలని కోరారు. స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవాలని.. ఇది భవిష్యత్‌లో ఎదుర్కోబోయే సవాళ్లకు ఉపయోగపడుతుందన్నారు.
ప్రధాని పిలుపుతో దేశమంతా స్పందించింది. గతేడాది ఇదేరోజున స్వీయ కర్ఫ్యూ పాటించారు దేశ ప్రజలు. దాంతో మార్చి 22న అత్యవసర సేవలు మినహా జనజీవనం స్తంభించింది. అయితే అదే సమయంలో కొవిడ్‌పై వరుస సమీక్షలు నిర్వహించిన ప్రధాని మోడీ.. మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించారు. ముందుగా 21 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత నాలుగు దశలుగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. మే 31 వరకు దేశం మొత్తం లాక్‌డౌన్ సంకెళ్లలో ఉండగా.. జూన్ 1 నుంచి క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వచ్చింది కేంద్రం.