కన్నడ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదు : మంత్రి మధు బంగారప్ప
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని కన్నడ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప స్పష్టం చేశారు.
బెంగళూరు: ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని కన్నడ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప స్పష్టం చేశారు. పరిషత్ ప్రశ్నోత్తరాల సమయంలో చిదానందగౌడ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 900 ప్రభుత్వ పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామపంచాయతీల్లో కర్ణాటక పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభిస్తామన్నారు. 500 పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని బడ్జెట్‌లో తెలిపామని చెప్పారు. అందుకు అనుగుణంగా 309 పాఠశాలలు ప్రగతి దశలో ఉన్నాయని వివరించారు. 2.72 లక్షల మంది పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్నట్లు తెలిపారు. ప్రతి పబ్లిక్‌స్కూల్ 1200 మంది విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు.
ఇతర సభ్యులు జగదేవ్ గుత్తేదార్, కేశవ్‌ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, పాఠశాల విద్యార్థులకు బూట్లు, సాక్సుల కోసం రూ.111.88 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 44,525 పాఠశాలలకు గ్రాంట్లు విడుదల అయ్యాయన్నారు.
వైరస్ వల్ల కృష్ణజింకల మృతి: మంత్రి ఖండ్రె
బెళగావి భూతరామనహట్టిలోని కిత్తూరు రాణి చన్నమ్మ జూలో 40 కృష్ణ జింకల మృతికి వైరస్ సోకడమే కారణమని అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రె వెల్లడించారు. పరిషత్‌లో సభ్యుడు తలవారసాబణ్ణ ప్రశ్నకు సమాధానంగా కృష్ణ జింకలు ‘హెమరాజిక్ సెప్టెసేమియా’ అనే వైరస్ కు గురైనట్లు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంలేదు : మంత్రి
ఓ రోగి కడుపులో గడ్డకు బదులు పేగులు తొలగించారనే ప్రచారంపై వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్‌పాటిల్ మాట్లాడుతూ, బీమ్స్ సంస్థలో ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని చెప్పారు. రోగి దీర్ఘకాలంగా మద్యానికి బానిస అని, పొగాకు వాడేవారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చేసరికే అతను తీవ్రమైన సమస్యతో ఉన్నాడన్నారు.