Nirbhaya Case: 20న ఉరి: విడాకులు కోరిన అక్షయ్‌ భార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Update: 2020-03-18 02:48 GMT
Ahshay (File Photo)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. వారిని ఉరితీసే క్షణాల కోసం యావత్ భారత ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిందితులకు కూడా ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. అన్ని న్యాయవకాశాలను నిందితులు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో నిందితులను మరో మూడు రోజుల్లో ఉరి తీస్తారు అనగా ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ పిటిషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు.

ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 'అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు' అంటూ ఆమె తన విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే విచిత్రంగా ఈ పిటిషన్‌ మార్చి 19న విచారణకు రానుంది. నిర్భయ దోషులను 20 న ఉరి తీయనున్నారు.

ఈ పిటిషన్ గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. 'హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని భార్యాభర్తలు ప్రత్యేక సందర్భాల్లో విడిపోవడానికి అవకాశం ఉంది.. ఆ ప్రకారం ఈ కేసులో అత్యాచారం అనే పెద్ద నేరమైన కేసు ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు.. ఈ మేరకు అతని భార్యకు అవకాశం ఉంది.. ఈ అవకాశాన్ని ఆమె వినియోగించుకుంటున్నారు' అని ఆయన తెలిపారు. అయితే ఆమె పిటిషన్ పై కొందరు న్యాయకోవిదులు మండిపడుతున్నారు.. అత్యాచారం జరిగిన ఎనిమిదేళ్ళకు ఈ విషయం గుర్తుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు దోషులలో మరొక వ్యక్తి ముకేశ్‌ సింగ్‌ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తానూ అసలు ఢిల్లీలోనే లేనని, డిసెంబరు 17, 2012లో తనను పోలీసులు రాజస్తాన్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారని చెబుతూ మరో పిటిషన్ దాఖలు చేశాడు.. అందులో తీహార్‌ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని కూడా ఆరోపించాడు. ఈ పిటిషన్‌పై తదుపరి ఆదేశాలు బుధవారం జారీచేస్తామని అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొన్నారు. అయితే ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికే నిందితులు ఒకరి తరువాత మరొకరు ఇలా నాటకాలు ఆడుతున్నారని.. నిందితులను త్వరగా ఉరి తీయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తున్నారు. మరి ఈసారైనా ఆమె డిమాండ్ నెరవేరుతుందో లేదో చూడాలి.


Tags:    

Similar News