Nipah Alert : పశ్చిమ బెంగాల్‌లో భయంకరమైన వైరస్ కలకలం..చైనా, పాకిస్థాన్ సహా ఆసియా దేశాల హై అలర్ట్

పశ్చిమ బెంగాల్‌లో భయంకరమైన వైరస్ కలకలం..చైనా, పాకిస్థాన్ సహా ఆసియా దేశాల హై అలర్ట్

Update: 2026-01-29 02:30 GMT

Nipah Alert : భారతదేశంలో ప్రాణాంతక నిపా వైరస్ మళ్ళీ పడగవిప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. డిసెంబర్ 2025 చివరలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో ప్రత్యేక నిఘాలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 20 ఏళ్ల తర్వాత నిపా కేసులు బయటపడటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కేరళలో ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

భారత్‌లో కేసులు నమోదైన వెంటనే పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. సింగపూర్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు విమానాశ్రయంలోనే శరీర ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే కార్మికులపై ప్రత్యేక నిఘా ఉంచింది. అటు చైనా, పాకిస్థాన్, నేపాల్, హాంకాంగ్, థాయ్‌లాండ్, మలేషియా దేశాలు కూడా అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద స్క్రీనింగ్‌ను వేగవంతం చేశాయి. థాయ్‌లాండ్ అయితే నిపా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే విమానాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించడమే కాకుండా, ప్రయాణికుల నుంచి హెల్త్ డిక్లరేషన్ ఫారాలను సేకరిస్తోంది.

బెంగాల్‌లో వైరస్ సోకిన ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా మరెవరికైనా వ్యాపించిందా అని తెలుసుకోవడానికి కేంద్ర బృందం రంగంలోకి దిగింది. బాధితులతో సన్నిహితంగా ఉన్న 196 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అయితే, ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. వీరందరికీ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. ఎవరిలోనూ నిపా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా బాధితులు చికిత్స పొందుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

నిపా వైరస్ లక్షణాలు - జాగ్రత్తలు

నిపా వైరస్ ప్రధానంగా పండ్లను తినే గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా ఇది చాలా వేగంగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెదడు వాపు వంటి ప్రాణాంతక లక్షణాలు కనిపిస్తాయి. నిపా వైరస్‌కు ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు పొందిన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కొన్ని టీకాలు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. కాబట్టి, గబ్బిలాలు కొరికిన పండ్లను తినకూడదని, జంతువులకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News