Monsoon Session: పార్లమెంటు తొలిరోజే విపక్షాల దాడి...డిఫెన్స్ లో సర్కార్

Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే హోరెత్తాయి.

Update: 2021-07-19 16:15 GMT

Monsoon Session: పార్లమెంటు తొలిరోజే విపక్షాల దాడి...డిఫెన్స్ లో సర్కార్

Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే హోరెత్తాయి. విపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. పోలవరంపై లోక్ సభలో వైసీపీ ఎంపీలు చర్చకు పట్టుపట్టారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగారు. రాజ్యసభ ఛైర్మన్‌ పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. చమురు ధరలు, కరోనా ఇతర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఆగస్టు 13వ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

విపక్షాల ఆందోళనతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల పరిచయానికి ముందే విపక్షాలు నిరసనలతో సభను హోరెత్తించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నచ్చ చెప్పినా వినని ఎంపీలు కొద్దిసేపు సభలో రభస సృష్టించారు. చమురు ధరలు. కరోనా ఇతర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష నేతలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇటీవల మృతిచెందిన ఎంపీలు, పార్లమెంట్‌ మాజీ సభ్యులతో పాటు ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌, పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ మృతిపై ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. అనంతరం స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. పోలవరంపై వైసీపీ సభ్యులు లోక్ సభలో చర్చకు పట్టుబట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా కేంద్రం పటించుకోవడం లేదని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

అటు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై చర్చ జరపాలంటూ రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. వైసీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

ద్రవ్యోల్బణం, రైతు అంశాలు, ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ సభ్యులు చర్చకు నోటీసు ఇచ్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ సభకు పరిచయం చేస్తున్న సందర్భంలో విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, పీయూశ్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఇదే ప్రథమమన్నారు. విపక్ష నేతలు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. సభ సజావుగా జరిగేందుకు అధికార, విపక్ష సభ్యులు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. మొత్తానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజో వేడెక్కాయి. విపక్ష సభ్యుల సవాళ్లను అధికార పక్షం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి మరి. 

Tags:    

Similar News