Bird Flu: బర్డ్ ఫ్లూతో 100 వలస పక్షులు మృత్యువాత

Bird Flu: హిమాచల్ ప్రదేశ్‌లో పాంగ్ డామ్ సరస్సు వద్ద గత 2 వారాలుగా 100 విదేశీ వలస పక్షులు చనిపోయాయి.

Update: 2021-04-07 07:25 GMT

Bird Flu: (ఫోటో: ది హన్స్ ఇండియా)

Bird Flu: బర్డ్ ఫ్లూ సెకండ్ వేవ్ మొదలైందా? అంటే అవుననే అంటున్నారు వైల్డ్ లైఫ్ అధికారులు. మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు అసలే కరోనా తో దేశమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే హిమాచల్ ప్రదేశ్ లో వలస పక్షులు బర్డ్ ఫ్లూతో మృత్యువాత పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌లో పాంగ్ డామ్ సరస్సు వద్ద గత 2 వారాలుగా 100 విదేశీ వలస పక్షులు చనిపోయాయి. దీని వెనక బర్డ్ ఫ్లూ సెకండ్ వేవ్ ఉందని వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. నిజానికి ఈ శాంక్చురీలో జనవరిలోనే బర్డ్ ఫ్లూని కనిపెట్టారు. అప్పట్లో జనవరి నెలలోనే 5,000 పక్షులు చనిపోయాయి. ఫిబ్రవరి ప్రారంభంలో కూడా కొన్ని రోజులు ప్రభావం చూపిన ఈ ఫ్లూ తర్వాత సైలెంట్ అయ్యింది. తాజాగా మార్చి చివరి నుంచి మళ్లీ కేసులు వస్తున్నాయి. మార్చి 25 నుంచి పక్షులు గుంపులుగా చనిపోయి కనిపిస్తున్నాయి. దాంతో సెకండ్ వేవ్ మొదలైందని ఫిక్స్ అయ్యారు.

ఈ చనిపోయిన పక్షులను మధ్యప్రదేశ్, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లో పరీక్షించారు. వాటిలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (H5N8) వైరస్ ఉంది అని వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ అర్చనా శర్మ తెలిపారు. ఇదివరకు పక్షులకు H5N1 అనేది సోకగా... ఇప్పుడు సోకినది మరో రకమైన రూపాంతర వైరస్ (కొత్త స్ట్రెయిన్) అంటున్నారు. ఐతే..రెండు స్ట్రెయిన్లూ ప్రమాదకరమైనవేననీ, ప్రాణాలు తీస్తాయని అర్చనా శర్మ తెలిపారు.పక్షులకు సోకే ఈ బర్డ్ ఫ్లూ చాలా వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉంటుందనీ, ఇది పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఇంతకుముందు..ఇండియా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు... ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్... పక్కరాష్ట్రం హర్యానాలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో హర్యానాలో H5N8 సబ్ టైప్ వైరస్ బయటపడింది. ఐతే ఇది మనుషులకు సోకినట్లుగా ఆధారాలు లేవని పరిశోధకులు తెలిపారు. మంగళవారం నాటికి పాంగ్ డామ్ సరస్సు దగ్గర 99 పక్షులు చనిపోయినట్లు తేల్చారు. చనిపోయిన పక్షుల్లో ఎక్కువగా బార్ హెడ్ బాతులే ఉన్నాయని అర్చనా శర్మ తెలిపారు. అలాగే అరుదైన గ్రే లాగ్ బాతులు కూడా 9 చనిపోయాయని ఆమె వివరించారు.

Tags:    

Similar News