Delhi: ఢిల్లీ ప్రజల్ని హెచ్చరిస్తున్న వాతావరణ విభాగం

Delhi: ఈ వేసవిలో 47 డిగ్రీల వరకు నమోదయ్యే చాన్స్

Update: 2022-04-28 09:46 GMT

Delhi: ఢిల్లీ ప్రజల్ని హెచ్చరిస్తున్న వాతావరణ విభాగం

Delhi: దేశ రాజధానిలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ్టి నుంచి వేడిగాలులు ఇంకా పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల 7 వరకు వడగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అమృత్ సర్, ఆగ్రా, చండీగఢ్, డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్‌, జార్ఖండ్ లలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని పసుపుపచ్చ హెచ్చరికలు జారీ చేశారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రేపటి నుంచి మే 7 వరకు మరో 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని, దీంతో ఢిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద ఈ వేసవిలో 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. 2017 ఏప్రిల్ 21న ఢిల్లీలో ఉష్ణోగ్రత 43.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇప్పటివరకు అదే ఆల్ టైమ్ హైగా ఉంది. 1941 ఏప్రిల్ 29న ఢిల్లీలో ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. తాజా హెచ్చరికల్ని బట్టి చూస్తే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

ఢిల్లీ వాసులు బయటకు వెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. గత 122 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి నెలలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయు. ఈ అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా, దేశంలోని పలు ప్రాంతాల్లో 35 శాతం మేరకు గోధుమ పంట దిగుబడి తగ్గిపోయింది. ఇలా అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం అనేక ఇతర పంటలపై ప్రభావం చూపుతుందని, అది పరోక్షంగా ప్రజల్ని ప్రభావం చూపుతుందంటున్నారు. 

Tags:    

Similar News