Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించిన నారీ శక్తులు.. ఇంతకీ వీళ్లు ఎవరో తెలుసా?
Operation Sindoor: పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఉగ్రవాదులపై తీవ్ర చర్యలు తీసుకుంది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించిన నారీ శక్తులు.. ఇంతకీ వీళ్లు ఎవరో తెలుసా?
Operation Sindoor: పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఉగ్రవాదులపై తీవ్ర చర్యలు తీసుకుంది. మే 7, బుధవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. ఈ చర్యకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును పెట్టింది.
ఈ ఆపరేషన్‌కు సంబంధించి భారత రక్షణ శాఖ ఇచ్చిన అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇద్దరు మహిళా అధికారులు పాల్గొనడం విశేషం. వీరిలో లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి (భారత సైన్యం), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్) ఉన్నారు. వీరి నేపథ్యంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ప్రస్థానం:
గుజరాత్‌లోని వడోదరలో 1981లో జన్మించిన సోఫియా ఖురేషి, బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సైన్యంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె 1999లో చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా భారత సైన్యంలో చేరారు. మొదట లెఫ్టినెంట్‌గా పనిచేశాక, క్రమంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగారు.
సైనిక సేవలో ఆమెకు గొప్ప అనుభవం ఉంది. 2006లో ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో భాగంగా కాంగోలో ఆమె మిలటరీ ఆబ్జర్వర్‌గా పనిచేశారు. శాంతి పరిరక్షక చర్యల్లో ఆమె పాత్ర మరువలేనిది. ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పంజాబ్ సరిహద్దుల్లో చేసిన సేవలకు గాను GOC-in-C నుంచి ఆమె ప్రశంసాపత్రం అందుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చిన భారీ వరదల సమయంలో ఆమె చేపట్టిన సహాయక చర్యలకు Signal Officer-in-Chief నుంచి ప్రత్యేక గుర్తింపు పొందారు. అదేవిధంగా, ఫోర్స్ కమాండర్ నుంచి కూడా ప్రశంసలు పొందారు.
సోఫియా ఆమె తాత సైన్యంలో పనిచేశారు. తండ్రి మత గురువుగా ఆర్మీలో కొంతకాలం సేవలందించారు. సోఫియా, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ తాజుద్దీన్ ఖురేషిని వివాహం చేసుకున్నారు. వారికి సమీర్ ఖురేషి అనే కుమారుడు ఉన్నాడు.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్:
వింగ్స్‌ను కలలలో ఊహించుకున్న వ్యోమికా సింగ్ చిన్ననాటి నుంచే పైలట్ కావాలన్న ఆశయంతో ఎదిగారు. విద్యాభ్యాసంలో భాగంగా ఎన్‌సీసీలో చేరడం ఆమెలో దేశసేవ పట్ల ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం, తన లక్ష్యాన్ని సాధించేందుకు భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా ప్రవేశించారు.
2019 డిసెంబర్ 18న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పర్మినెంట్ కమిషన్ పొందడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తన కుటుంబం నుంచి దేశ భద్రతా బలగాల్లో చేరిన మొట్టమొదటి వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. వ్యోమికా సింగ్ సేవా ప్రదేశాలు కూడా సవాలుతో కూడుకున్నవే. జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతదేశంలోని ఎత్తైన, క్లిష్ట ప్రాంతాల్లో ఆమె చేతక్, చీతా హెలికాప్టర్లను నైపుణ్యంగా నడిపారు. పలు అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ మిషన్లలో ఆమె అందించిన సహాయం అగ్రగణ్యంగా నిలిచారు.