'పెళ్ళి' కోసం 200 కిలోమీటర్లు 'సైకిల్' యాత్ర!

Update: 2020-05-02 01:45 GMT

కరోనా కొంత మందితో సాహసాలు చేయిస్తోంది. లాక్ డౌన్ వేళలో వలస కార్మికులు ఇళ్ళకు చేరుకోవడానికి వేలాది కిలోమీటర్లు నడక బాట పట్టడం తెలిసిందే. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో వివాహాలకు ఆటంకాలు వచ్చాయి. ఎప్పుడో కుదిరిన పెళ్ళిళ్ళు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి.

అయితే, నాలుగు నెలల క్రితం ముహూర్తాలు నిర్ణయించుకున్న పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ అగకూడదని నిర్ణయించుకున్నాడో యువకుడు. వంద కిలోమీటర్ల దూరంలోని పెళ్ళికూతురు ఇంటికి ఒక్కడూ సైకిల్ పై వెళ్లి సరిగ్గా అనుకున్న సమయానికి ఆమ్మాయి మెడలో మూడు ముళ్ళూ వేసేశాడు.

ఉత్తరప్రదేశ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హమీర్ పూర్ జిల్లా పౌథియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి (24) కి నాలుగు నెలల క్రితం తానున్న ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలోని యువతి తో వివాహం నిశ్చయం అయింది. ఏప్రిల్ 25 వ తేదీ వివాహానికి ముహూర్తమూ పెట్టుకున్నారు. ఈ లోపు కరోనా మహమ్మారి రావడం..లాక్ డౌన్ కారణంగా పెళ్లికి అనుమతి దొరకలేదు.

పోలీసులకు ఈ పెళ్లి విషయమై వధువు తరుపు వారు, వరుని తరుపు వారు అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నారు. కానీ ముహూర్తం ముంచుకొస్తున్నా అనుమతి లభించలేదు.

ఇక ఇలా లాభం లేదనుకున్న ప్రజాపతి తన సైకిల్ పై వధువు ఊరు చేరుకున్నాడు. '' ముహూర్తాలు పెట్టుకున్నాం. వధువు తరుపు వారు, మేము బంధువులకు శుభలేఖలూ పంచేశాం. ముహూర్తం మించి పోయి పెళ్లి ఆగిపోవడం మంచిది కాదని పించింది. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకే సైకిల్ పై నేను అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పాడు ప్రజాపతి.

అయితే, తన వద్ద మోటార్ సైకిల్ ఉందనీ, కానీ తనకు లైసెన్స్ లేదనీ చెప్పాడు. పదోతరగతి వరకూ చదువుతున్న ఇతగాడు వ్యవసాయం చేస్తున్నాడు.

ఇక వధువు ఇంటి వద్ద వివాహం చేసుకున్న తరువాత పెళ్లి కూతుర్ని అదే సైకిల్ పై ఎక్కించుకుని తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు ప్రజాపతి. ఇలా ఎందుకు అని అడిగితే, ''ఇంటి వద్ద అమ్మ ఒంటరిగా ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఈ లాక్ డౌన్ ఎప్పటికి ఎత్తి వేస్తారో తెలీదు. అందుకే కష్టం అయినా సరే డబుల్స్ తొక్కుతూ తిరిగి ఇంటికి చేరుకున్నాను. కొంచెం కష్టమే అయింది. కానీ, నొప్పులు రాకుండా మందులు వేసుకుని సైకిల్ తొక్కాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ఇటు వధువు తరఫు వారు.. వరుని తరఫు వారు పెళ్లి అనంతరం చేయాల్సిన కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఊరిలో అందరికీ విందు ఇవ్వాలని చూస్తున్నారు.


Tags:    

Similar News