Maha Shivaratri 2021: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు

Maha Shivaratri 2021: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు * ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Update: 2021-03-11 05:00 GMT

మహా శివరాత్రి (ఫైల్ ఫోటో)

Maha Shivaratri 2021ఏపీ, తెలంగాణలో శివరాత్రి మహోత్సవాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని.. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతుల మధ్య ఆలయాలు మెరిసి పోతున్నాయి. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలకు తెల్లవారుజామునుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి, శివయ్యకు ప్రత్యేక అభిషేకాల కోసం ఆలయాల్లో బారులు తీరారు భక్తులు. దీంతో శివనామ స్మరణతో శివాలయాలన్నీ మార్మోగుతున్నాయి.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కన్నులపండువగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే.. ఉజ్జయిని, కాశీలో శివరాత్రి మహోత్సవాలు అంబరాన్నంటాయి. ఇక.. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పలు శైవక్షేత్రాలు తెరుచుకోలేదు. నాసిక్‌లోని త్రెయంబకేశ్వరం, ముంబైలోని బాబుల్‌నాథ్‌ ఆలయంలో భక్తులకు అనుమతి నిరాకరించారు ఆయా ఆలయ అధికారులు.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. తెలంగాణలోని వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తి, శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక.. సాయంత్రం 6 గంటలకు కల్యాణమండపంలో మహా లింగార్చన, రాత్రి 11గంటల 35 నిమిషాలకు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

అలాగే వరంగల్‌ జిల్లా హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంబారన్నంటాయి. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరగనుంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నీలకంటేశ్వరాలయం, శంభునిగుడి, భిక్నూర్‌ సిద్దిరామేశ్వర ఆలయం, నందిపేట్‌ పలుగుగుట్ట, బోధన్‌ చక్రేశ్వర శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్‌ నిబంధనలతో కీసర రామలింగేశ్వరస్వామి దర్శనాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

ఇక.. ఏపీ విషయానికొస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం సోమారామంకు భక్తులు పోటెత్తారు. అమావాస్య సమీపిస్తుండటంతో గోధుమరంగులో సోమేశ్వరస్వామి దర్శనమిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి శ్రీచాయ సోమేశ్వరస్వామిని దర్శించుకున్నారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. ప్రత్యేక పూజలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకున్నారు. అటు.. కోటప్పకొండకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ సీఎం జగన్‌ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న మహాశివరాత్రి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. 

Tags:    

Similar News