Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం... అరుపులు, కేకలతో భక్తుల పరుగులు
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం... అరుపులు, కేకలతో భక్తుల పరుగులు
Maha Kumbh mela fire accident: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి మంటలు ఎగిసిపడటంతో మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు అరుపులు, కేకలతో పరుగులు తీశారు. ఇప్పటికే సమాచాం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన ఫైర్ ఇంజన్స్ ను రంగంలోకి దింపింది. ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పే పనిలో ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో భక్తులు బస చేయడం కోసం ఏర్పాటు చేసిన టెంట్స్ కాలి బూడిదయ్యాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహా కుంభమేళాలోని సెక్టార్ 19 లో ఉన్న టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తోంది. అయితే, అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక అధికార యంత్రాంగం తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందం (NDRF) బలగాలు కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సహాయంగా నిలిచారు.
ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం అందుతోంది. స్థానికులు కూడా మంటలు ఆర్పే పనిలో అగ్నిమాపక శాఖ సిబ్బందికి, పోలీసులకు సహాయం అందించారు. ఈ అగ్ని ప్రమాదం వెనుకున్న కారణాలు ఏంటని తెలుసుకునే పనిలో ప్రయాగ్ రాజ్ పోలీసులు ఉన్నారు. ఇది ప్రమాదవశాత్తుగా జరిగిందా లేక దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్త అప్‌డేట్ అవుతోంది. దయచేసి పేజ్ రిఫ్రెష్ చేయండి.