లోక్‌సభ పనిచేసింది 21 గంటలే.. నిరసనలతో 74 గంటలు వృథా..

Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

Update: 2021-08-11 16:15 GMT

లోక్‌సభ పనిచేసింది 21 గంటలే.. నిరసనలతో 74 గంటలు వృథా..

Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ జరగాల్సి ఉండగా ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా రెండు రోజుల ముందే ముగించారు. ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. విపక్షాల నిరసనల కారణంగా 74 గంటలు వృథా అయ్యాయి. పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ కథనాలు రావడంతో ఈ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది.

పెగాసస్ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు మొదటి రోజు నుంచే ఆందోళనలకు దిగాయి. దీంతో సభలో వాయిదాల పర్వం నడిచింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 17 సార్లు సమావేశమైంది. ఇందులో మొత్తం 96 పనిగంటలు ఉండగా లోక్‌సభ కేవలం 21 గంటల 14 నిమిషాలు మాత్రం పనిచేసింది. విపక్షాల ఆందోళనలతో 74 గంటల 46 నిమిషాలు వృథాగా పోయాయి. అంటే ఈ సమావేశాల్లో లోక్‌సభ పని చేసింది కేవలం 22శాతమేని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

విపక్షాల నిరసనల నడుమ కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి. ఇందులో కీలక 127వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. దాదాపు అన్ని బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే కేవలం నిమిషాల వ్యవధిలో ఆమోదం పొందాయి. ఉభయ సభల్లో ఒక్క రాజ్యాంగ సవరణ బిల్లు సమయంలో మాత్రం విపక్షాలు ఆందోళనలకు విరామమిచ్చాయి. అటు రాజ్యసభ ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. చైర్మన్ మీదకు ఎంపీలు రూల్ బుక్ విసరి ఆందోళన చేయడంతో ఉపరాష్ట్రపతి భావోద్వేగానికి గురయ్యారు.

Tags:    

Similar News