లాక్ డౌన్ సడలింపులతో పంజా విసురుతోన్న కరోనా

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా ఉన్న కరోనా.. సడలింపులు ఇవ్వటంతో పంజా విసురుతోంది.

Update: 2020-06-17 10:35 GMT

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా ఉన్న కరోనా.. సడలింపులు ఇవ్వటంతో పంజా విసురుతోంది. సాధారణ పరిస్థితులను వైరస్‌ అనుకూలంగా మార్చుకుంది. వేగంగా విస్తరిస్తూ.. వేలమందిని తన గుప్పిట్లో బంధిస్తోంది కరోనా. దేశవ్యాప్తంగా రెండు వారాల్లో లక్షా 40 వేల కొత్త కేసులు నమోదవటం ఆందోళన రేకెత్తిస్తోంది.

లాక్‌డౌన్ సడలింపులతో దేశంలో కరోనా విజృంభిస్తోంది. సడలింపులు ఇచ్చిన తర్వాత రెండు వారాల్లో లక్షా 40వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నాలుగు వేలకుపైగా మరణాలు సంభవించాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 11 వేల కేసులు రోజూ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఐదు రోజులు దేశవ్యాప్తంగా రోజుకు 3 వందల మంది మరణించారు.

మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ ఒక్కరోజులో మూడు వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 120 మంది మృత్యువాతపడ్డారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కలవరపెడుతోంది. ఢిల్లీలో ప్రతీ పది లక్షల మందిలో 70.92 మంది కరోనా బాధితులు చనిపోతున్నారు. ఇది జాతీయ సగటు కంటే 10 రెట్లు ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానాల్లోనూ కొవిడ్‌ మరణాలు పెరిగాయి.

ఇప్పటికీ రోజువారీ కేసుల్లో 65%పైగా కేవలం ఢిల్లీ, ముంబయి, తమిళనాడు నుంచే వస్తున్నాయి. రోజువారీ వృద్ధిరేటు ఢిల్లీలో అత్యధికంగా ఉంది. దీంతో కేసులు అధికంగా నమోదవుతోన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో టెస్టుల సంఖ్య పెంచాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్‌ అమలు చేసిన క్లస్టర్‌ అనాలసిస్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.

ఇక ఈనెల ప్రారంభంలో లక్షా 76 వేల మంది కరోనా బాధితులు ఉండగా.. ఈ పదిహేను రోజుల్లో మరో లక్షా 55 వేల మందిని కరోనా వైరస్‌ చుట్టేసింది. జూన్‌కు ముందు కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న పట్టణాలు, నగరాల్లోనూ ఈ నెలలో వేగంగా కరోనా విస్తరించటం ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో ఐసోలేషన్‌ బెడ్ల కొరత వస్తుందని హెచ్చరించింది ఐసీఎంఆర్‌.

Tags:    

Similar News