Kolkata Doctor Rape and Murder Case: సీబీఐ చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్... ఆధారమే లేదన్న నివేదిక
Kolkata Doctor Rape and Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన నాలుగవ అంతస్తులోని సెమినార్ రూంలో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చుననే సందేహాలను వ్యక్తం చేసింది.
సెమినార్ గదిలోని నీలి రంగు పరుపుపై వైద్యురాలు, దాడికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ, దాడి జరిగినట్టు ఆధారాలు కనిపించలేదని తెలిపింది. రూమ్ లోపల కానీ మరెక్కడా ఆనవాళ్లు లేవని ఈ మేరకు దర్యాప్తు సంస్థ సీబీఐకి సీఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక సమర్పించింది.
ఈ ఏడాది ఆగష్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును మొదట కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది.
అయితే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసు విచారణలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్లింది. అనంతరం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు పశ్చిమ బెంగాల్ అంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారికి దేశం నలుమూలల నుండి డాక్టర్లు, ప్రజా సంఘాల నుండి మద్దతు లభించింది. ఈ వరుస పరిణామల తరువాత సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది.