Karnataka: కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో కర్ణాటకలో కలకలం

Karnataka: మంత్రి ఈశ్వరప్ప పదవికి రాజీనామా

Update: 2022-04-15 03:00 GMT

కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో కర్ణాటకలో కలకలం

Karnataka: కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. క‌ర్ణాట‌క మంత్రి ఈశ్వరప్ప ఎట్టకేలకు దిగొచ్చారు. మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈశ్వరప్ప పీఏ వేధింపులతో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్ప పేరును కూడా చేర్చారు. దాంతో ప్రతిపక్షాలు మంత్రి ఈశ్వరప్పను పదవికి రాజీనామా చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహ‌త్య కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్పపై కేసు న‌మోదైంది. అనుచరులు బసవరాజ్, రమేష్‌లపై కూడా కేసు నమోదైంది. మంత్రి ఈశ్వరప్ప 40 శాతం క‌మీష‌న్ డిమాండ్ చేశారంటూ సూసైడ్‌లో లేఖ‌లో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ పేర్కొన్నారు. సంతోష్ పాటిల్ సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.ఎఫ్ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయ‌న అనచరులైన బ‌స‌వ‌రాజ్, ర‌మేశ్ పేర్లను కూడా చేర్చారు. ఈ కేసును పార‌ద‌ర్శకంగా ద‌ర్యాప్తు చేయాల‌ంటూ కర్ణాటక సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై పోలీసుల‌ను ఆదేశించారు. ఈశ్వరప్పను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాల‌ంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. మంత్రి ఈశ్వరప్పపై హత్య, అవినీతి అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈశ్వరప్ప, ఆయ‌న అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈశ్వరప్పకు సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై స‌మ‌న్లు జారీ చేశారు.

రాష్ట్రంలో కాంట్రాక్టర్ సంతోష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. తాను వెళ్లేముందు భార్యకు చెప్పి ఏప్రిల్ 11న బెల్గాం నుంచి వెళ్లాడు. అప్పటినుంచి అతడు క‌నిపించ‌కుండా పోయాడు. ఇటీవలే అతడి మృతదేహం ఉడిపిలో కనిపించింది. ఉడిపిలోని ఓ లాడ్జిలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ శవమై కనిపించాడు. లంచం డిమాండ్ చేసిన మంత్రి, అతని అనుచరుల వల్లనే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఆరోపించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈశ్వరప్పపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News