Pahalgam attack: బుల్లెట్ వెంట్రుక వాసిలో దూసుకుపోయింది.. అమ్మానాన్నల ప్రాణాలు కాపాడిన అబ్బాయి ఆకలి
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆ దాడి నుండి ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. బైసరన్ వ్యాలీని చూసేందుకు వెళ్లి ఉగ్రవాదుల దాడి నుండి తప్పించుకున్న వారు ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. తమకు ఎదురైన ఆనాటి ఆ భయంకరమైన అనుభవాన్ని చెప్పుకుని ఇప్పటికీ నిలువునా వణికిపోతున్నారు. అందులో కర్ణాటకకు చెందిన ప్రదీప్ హెగ్డె కుటుంబం కూడా ఒకటి.
ప్రదీప్ హెగ్డె, ఆయన భార్య శుభా హెగ్డె, కుమారుడు సిద్ధాంత్ బైసరన్ వ్యాలీ చూసేందుకు వెళ్లారు. ఈ లోయనే మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటుంటారు. అంత అందమైన ప్రదేశంగా ఈ ప్రాంతానికి పేరుంది. అందుకే టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది.
ఏప్రిల్ 21న మేం శ్రీనగర్ చేరుకున్నాం.ఆ మరునాడు అక్కడి నుండి పహల్గామ్ బయల్దేరాం. అక్కడి నుండి బైసరన్ వ్యాలీకి వెళ్లాం. అందుకోసం ముగ్గురం మూడు గుర్రాలు కిరాయికి తీసుకున్నాం. వర్షం పడటంతో దారి అంతా బురదమయమై జారుతోంది. 15 నిమిషాల ప్రయాణం తరువాత కొండపైకి చేరుకున్నాం. అక్కడే గుర్రాల వాళ్లు మమ్మల్ని దింపేసి కిందకు వెళ్లిపోయారు. ఆ ప్రదేశంలోకి వెళ్లడంతోనే విపరీతంగా రద్దీ కనిపించింది. ముందుగా జిప్ లైన్ వద్దకు వెళ్లి అక్కడే ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ గంటన్నరసేపు గడిపాం.
కాల్పులు జరిగిన ప్రదేశం అక్కడికి దగ్గర్లోనే ఉంది. మేం అక్కడికి వెళ్దామని అనుకుంటుండగానే మా అబ్బాయి సిద్ధాంత్ ఆకలిగా ఉంది ఏమైనా తినేసి వెళ్దామన్నాడు. ఇక్కడి నుండి కిందకు వెళ్లే ముందు తిందామని నచ్చచెప్పినప్పటికీ వాడు వినిపించుకోలేదు. దాంతో అక్కడే ఉన్న ఒక ఫుడ్ స్టాల్ కు వెళ్లి మ్యాగీ ఆర్డర్ చేశాం. మ్యాగీ తిన్న తరువాత టీ ఆర్డర్ చేసి టీ తాగుతున్నాం. ఇంతలోనే బుల్లెట్స్ శబ్ధం వినిపించింది. అది బుల్లెట్స్ శబ్ధం అని అనుకోలేదు. ఆ హోటల్ అతను కూడా అవి బుల్లెట్ శబ్ధాలు అని అనుకోలేదు. అటవీ ప్రాంతం కాబట్టి జంతువులను తరిమేయడానికి ఏమైనా టపాసులు పేల్చుతున్నారేమో అని హోటల్ అతను అన్నాడు.
అంతలోనే మరో 15-20 సెకన్లలోనే ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్ద తుపాకులతో కనిపించారు. వారిలో ఒకతను కిందున్న లోయవైపు వెళ్తుండగా మరొకతను మావైపే వస్తూ కనిపించాడు. అతడు మావైపే రావడం చూసి మేం నేలపై పడుకున్నాం. కానీ టైబుల్ పై మా బ్యాగ్ ఉండిపోయింది. అందులోనే మా ఐడి కార్డులు, ఫోన్స్ ఉన్నాయి. అందుకే ఆ బ్యాగ్ కోసం మా ఆవిడ పైకి లేచి బ్యాగ్ తీసుకుంది. తను కిందకు వంగేలోపే చెవి వద్ద నుండి సయ్యుమని ఏదో దూసుకెళ్లిన శబ్ధం వినిపించింది. ఏంటా అని చూస్తే బుల్లెట్ మా వెనకాలే నేలకు తాకి పడిపోయింది.
ఈ ఘటన ఇలా జరుగుతుండగానే అక్కడే ఉన్న పోనీ రైడర్స్ ( Pony riders - పర్యాటకులను గుర్రాలపై తీసుకెళ్లే కూలీలు) "అందరూ గేటు వైపు పరుగెత్తండి" అని అరిచారు. అలా అక్కడి నుండి మేం ముగ్గురం బయటపడ్డాం అంటూ ప్రదీప్ హెగ్డే ఆ రోజు జరిగిన విషయాన్ని వివరించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు.