Karnataka: నేడు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం
Karnataka: కన్నడ కంఠీరవ స్టేడియంలో మ.12.30కి ప్రమాణస్వీకారం
Karnataka: నేడు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం
Karnataka: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేయడానికి కంఠీరవ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. మధ్యాహ్నం సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్ డోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఢిల్లీ నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ఖర్గే, సిద్దరామయ్య ఫోన్ చేసి ఆహ్వానించారు. అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్‌పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, బిహార్ డీసీఎం తేజస్వీయాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితరులకూ ఆహ్వానాలు పంపారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ప్రముఖులు హాజరవుతున్నందున అందుకు తగినట్లుగానే చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాగా, ప్రమాణ స్వీకారోత్సవం జరిగే కంఠీరవ స్టేడియంను డీకే శివకుమార్ పరిశీలించారు. ఢిల్లీ వెళ్లేముందు స్టేడియానికి చేరుకుని అక్కడి ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లతో చర్చించారు. కనీసం లక్షమంది పాల్గొంటారని, అందరికీ తగిన ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు.
ఇక మంత్రివర్గంలో ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై చర్చల నిమిత్తం సిద్దరామయ్య, డీకే శివకుమార్ శుక్రవారం మధ్యాహ్నం ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎంతమందిని కేబినెట్‌లో చేర్చుకుంటారనేది ఖరారు కాలేదు. కానీ మంత్రి పదవి ఆశిస్తున్న దాదాపు 50మంది వరకూ ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యనేతలను కలిసి తమ పేర్లను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఓవైపు ఖర్గేతో భేటీ అయ్యేందుకు సిద్దరామయ్య, డీకే శివకుమార్ వెళ్లే సమయానికే కొంతమంది కర్ణాటక నేతలు ఆయన్ను కలిశారు. ఆ తర్వాత కూడా తమ ప్రయత్నాలు కొనసాగించారు.
కాబోయే సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ శుక్రవారం ఢిల్లీలో రాహుల్, ప్రియాంకతో భేటీ అయి మంత్రివర్గ కూర్పు సహా పలు అంశాలపై చర్చించారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వారిద్దరినీ ఆహ్వానించారు.