ఢిల్లీకి పవన్.. సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం..

Update: 2020-03-06 06:08 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. జనసేనకు చెందిన కీలక నేతల తో కలిసి హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్బంగా జనసేనాని బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా తోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవనున్నట్టు తెలుస్తోంది. తాజా రాజకీయాల పరిణామాల తోపాటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పోటీ, రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

ఈ భేటీలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎన్నేసి సీట్లలో పోటీ చేయాలో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పొత్తులపై సాయంత్రం కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు జనసేన నేతలు చెబుతున్నారు. అలాగే రాజధాని విషయంపై కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. అయితే రాజధాని విషయంపై ఇప్పటికే తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

కాగా గత ఎన్నికల్లో ఎవరికీ వారు ఒంటరిగా పోటీ చేసిన జనసేన-బీజేపీలు.. ఈ ఏడాది ప్రారంభంలో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇకనుంచి జరిగే ప్రతి ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని పలుమార్లు నిర్ణయించుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో వీరి పొత్తు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన రెండు పార్టీలు ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్నాయి.

ఇదిలావుంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార వైసీపీ రెడీగా ఉంది. కోర్టు సూచించిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయనించుకుంది. ఈరోజు తుది రిజర్వేషన్ల జాబితాను కూడా హైకోర్టుకు సమర్పించింది. ఇవాళ సాయంత్రం లేదంటే రేపు మధ్యాహ్నం లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు.  

Tags:    

Similar News