షాకింగ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. 100వ రాకెట్ మిషన్‌లో సాంకేతిక లోపం
ISRO's 100th rocket mission: ఇస్రో ప్రయోగించిన 100 రాకెట్ మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. జనవరి 29, బుధవారం నాడు ఉదయం 6:23 గంటలకు ఇస్రో 100వ రాకెట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా NVS-02 అనే నావిగేషన్ శాటిలైట్ ను ఇస్రో నింగిలోకి పంపించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F15 అనే రాకెట్ ఈ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగం చేసిన 19 నిమిషాల తరువాత రాకెట్ ఆ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యోలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో విజయవంతంగా 100వ ప్రయోగాన్ని పూర్తి చేయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. కానీ ఆదివారం నాడు ఈ శాటిలైట్ పొజిషన్ సెట్ చేసే క్రమంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తాజాగా ఇస్రో వెల్లడించింది. రాకెట్ కక్ష్యను పైకి తీసుకెళ్లే క్రమంలో రాకెట్ కింద థ్రస్టర్స్‌ను మండించే ఆక్సిడైజర్ వాల్వులు తెరుచుకోలేదని ఇస్రో తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది.
ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో ఈ శాటిలైట్‌ను అంతిమంగా ఏ కక్ష్యలోకి అయితే ప్రవేశపెట్టాల్సి ఉందో... ఆ పని ఇంకొంత ఆలస్యమైనా కావొచ్చు. లేదా అసలు సాధ్యపడకపోవచ్చునని ఎన్డీటీవీ వార్తా కథనం పేర్కొంది.