Ajit Pawar: నీకెంత ధైర్యం? మహిళా ఐపీఎస్‌తో అజిత్‌ పవార్‌ వాగ్వాదం

మహిళా ఐపీఎస్‌తో అజిత్‌ పవార్‌ వాగ్వాదం

Update: 2025-09-05 05:56 GMT

మహారాష్ట్రలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునే క్రమంలో ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి – రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతోంది. ఇది సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి పవార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సంఘటన వివరాలు ఇలా:

సోలాపూర్ జిల్లా, కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామం పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు, ఎస్‌డీపీఓ (సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్) ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి తవ్వకాలను నిలిపివేశారు. ఈ చర్యల నేపథ్యంలో అక్కడి కొంతమంది గ్రామస్థులు, ఎన్సీపీ కార్యకర్తలు అధికారులతో ఘర్షణకు దిగారు.

వివాదం పెరగడంతో ఒక కార్యకర్త ఎన్సీపీ అధినేత, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ను ఫోన్ లో సంప్రదించి, ఫోన్ ను అంజనా కృష్ణకు ఇచ్చారు.

ఫోన్ లో మాట్లాడిన అజిత్ పవార్, ఇసుక తవ్వకాలపై చర్యలు నిలిపేయాలంటూ అధికారిణిని ఆదేశించారు. అయితే తాను నిజంగా ఉపముఖ్యమంత్రితోనే మాట్లాడుతున్నానని ధృవీకరించాలన్న ఉద్దేశంతో, అంజనా కృష్ణ వీడియో కాల్ చేయాలని కోరారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన అజిత్ పవార్, "నన్నే వీడియో కాల్ చేయమంటావా? నీకు ఎంత ధైర్యం? మీపై చర్యలు తీసుకుంటా" అంటూ మండిపడ్డారు. చివరగా వీడియో కాల్ కు తన నెంబర్ కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అంజనా కృష్ణ పవార్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. వీడియోలో ఆయన తక్షణమే చర్యలు ఆపేయాలంటూ సూచించారు. అయితే, ఈ సంఘటనపై వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో అజిత్ పవార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెటిజన్ల ఆగ్రహం:

ఈ ఘటనపై ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారిని బెదిరించారని, అక్రమార్కులపక్షాన మాట్లాడటం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎస్ అధికారిణి విధులకు రాజకీయంగా ఆటంకం కలిగించారంటూ విమర్శలొచ్చాయి.

ఎన్సీపీ స్పందన:

ఈ విమర్శలపై ఎన్సీపీ నాయకుడు సునీల్ తట్కరే స్పందిస్తూ, పవార్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన ఉద్దేశం గ్రామస్థులను శాంతింపజేయడమే అయి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అజిత్ పవార్ ఎప్పుడూ మద్దతివ్వరని స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ స్పందించడానికి నిరాకరించారు.

Tags:    

Similar News