Indians deported from US: గత 15 ఏళ్లలో అమెరికా నుండి ఏ ఏడాది ఎంత మంది డిపోర్ట్ అయ్యారంటే...
Indians deported from US: గత 15 ఏళ్లలో అమెరికా నుండి ఏ ఏడాది ఎంత మంది డిపోర్ట్ అయ్యారంటే...
Indians deported from US: అమెరికా ఇలా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. అంతేకాకుండా ఇదేమీ కేవలం ఏదో ఒక్క దేశానికే వర్తించే ప్రక్రియ కాదని, అన్ని దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులతో అమెరికా ఇలానే వ్యవహరిస్తోందని చెప్పారు.
2009 నుండి ఇప్పటివరకు గత 15 ఏళ్లలో అమెరికా మొత్తం 15,756 మంది భారతీయులను అక్రమవలసదారులుగా గుర్తించి వెనక్కు పంపించిందన్నారు. భారతీయులను అమెరికా వెనక్కు పంపించిన తీరుపై గురువారం పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో వారికి సమాధానం ఇస్తూ రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు తమ ముందున్న లక్ష్యం అక్రమ వలసలు అరికట్టడమే అని జై శంకర్ తెలిపారు. భారతీయులను వెనక్కి పంపించేటప్పుడు వారితో తప్పుగా ప్రవర్తించొద్దనే విషయంలో అమెరికాతో తాము సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
సంవత్సరాల వారీగా అమెరికా నుండి ఇండియాకు డిపోర్ట్ అయిన వారి సంఖ్య ఇలా ఉంది.
2009 లో - 734 మంది,
2010: 799
2011: 597
2012: 530
2013: 515
2014: 591
2015: 708
2016: 1,303
2017: 1,024
2018: 1,180
2019: 2,042
2020: 1,889
2021: 805
2022: 862
2023: 617
2024: 1,368 మంది ఉన్నారు.
2025: 104 (ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం)
ఏ ఏడాదిలో ఎక్కువ... ఎప్పుడు తక్కువ
2019 లో అత్యధికంగా 2042 మంది ఇండియన్స్ ను అమెరికా వెనక్కు పంపించింది. ఆ తరువాతి ఏడాది 2020 లో కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న సమయంలో 1889 మందిని వెనక్కు పంపించారు. అతి తక్కువగా 2013 లో అమెరికా 515 మంది భారతీయులను ఇండియాకు డిపోర్ట్ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 5 బుధవారం నాడు అమెరికా నుండి ఒక మిలిటరీ ఫ్లైట్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. అందులో 104 మంది ఇండియన్స్ ఉన్నారు. వారిలో అత్యధికంగా 33 మంది హర్యానా నుండి కాగా మరో 33 మంది గుజరాత్ నుండి ఉన్నారు. పంజాబ్ నుండి 30 మంది ఉన్నారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ నుండి ముగ్గురు చొప్పున, చండీగఢ్ నుండి ఇద్దరు ఉన్నారు.
భూములు అమ్మి, అప్పులు చేసి...
అమెరికాలో సరైన పాస్‌పోర్ట్, వీసా వంటి డాక్యుమెంట్స్ లేకుండా పట్టుబడి ఇండియాకు తిరిగొచ్చిన వారు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంటున్నారు. భూములు, జాగల అమ్మేసి అమెరికా వెళ్లామని, వెళ్లిన కొన్నాళ్లకే ఇలా ఇండియాకు తీసుకొచ్చారని వారు చెబుతున్నారు. ఇంకొందరు తాము 40-50 లక్షలు అప్పు చేసి వెళ్లామని చెబుతున్నారు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు దారిపొడవునా తాము పడిన కష్టాలను వివరిస్తున్నారు. పనామా అడవుల్లో బురదలో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడుచుకుంటూ, అక్కడే తలదాచుకుంటూ వెళ్లిన తీరును గుర్తుచేసుకుంటున్నారు.
కొలంబియా కంటే భారత్ తక్కువా?
ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నాం. కానీ టాప్ 10 దేశాల జాబితాలో కూడా లేని కొలంబియా వారి దేశానికి చెందిన ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ కోసం ఓ ప్రత్యేక విమానం పంపించింది. మరి మన భారత్ అంతకంటే హీనమా అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భారతీయుల కోసం భారత్ కూడా విమానాన్ని పంపిస్తే అమెరికా ఇలా మిలిటరీ ఫ్లైట్‌లో వారిని అమర్యాదగా పంపించాల్సి వచ్చేది కాదు కదా అని గోఖలే అభిప్రాయపడ్డారు.
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఏమన్నారంటే...
విపక్షాల నుండి కేంద్రంపై వచ్చిన ఈ విమర్శలకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సమాధానం ఇచ్చారు. అమెరికాలో డిపోర్టేషన్ ప్రక్రియను అక్కడి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చూస్తారన్నారు. వారికి ఒక విధివిధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు. 2012 నుండే ఈ విషయంలో అమెరికా ఒక నిర్దిష్టమైన విధానం అనుసరిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.