Indian Army Kindness: దారితప్పిన చైనీయులకు దయతో దారిచూపిన భారత్ ఆర్మీ!

Indian Army Kindness | మంచుకొండల్లో దారి తప్పిన చైనీయుల పట్ల భారత జవాన్ల ఔదార్యం.

Update: 2020-09-05 12:39 GMT

photo curtesy Indian Army Twitter

భారతదేశం అంటేనే సహనానికి పుట్టిల్లు. మన జీవన సంస్కృతికి ఆలంబన సామరస్యం.. కష్టంలో ఉన్నవాళ్ళు శత్రువులైనా సహాయం చేయడం మన ధర్మం. అవతలి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా.. అవసరమైతే వారి విషయంలో దయతో వ్యవహరించడంలో భారతీయులకు మించిన వారు లేరు. ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే.. మన ఆర్మీ చేసిన ఒక గొప్ప పని చెప్పడానికే..

అది చైనా సరిహద్దు. అక్కడ ప్రస్తుతం పూర్తిగా యుద్ధ వాతావరణం. మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు చైనా సైన్యం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ అపూర్వ ధైర్య సాహసాలతో మన జవాన్లు ప్రతిక్షణం కంటిమీద రెప్పవేయకుండా... వార్ అడుగులు ముందు పడకుండా అడ్డుకుంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతోంది కదా..

అటువంటి చోట..రెండు సరిహద్దు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి అవతలి వారి క్రూరత్వానికి ప్రతీకగా నిలిస్తే.. మరొకటి మన దేశ ఔన్నత్యాన్ని చాటింది.

అవి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు. చైనా సరిహద్దుల్లోని రాష్ట్రాలు. ఇక విషయంలోకి వస్తే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో ఐదుగురు వేట కోసం అడవికి వెళ్లారు. అటుతరువాత వారి ఆచూకీ కనిపించలేదు. వారికోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిని చైనా అపహరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారు. అదే విషయాన్ని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటె..ఉత్తర సిక్కిం ప్రాంతంలోకి దారి తప్పిన ముగ్గురు చైనీయులు వచ్చారు. 17,500 అడుగుల ఎత్తులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో దారి తప్పిన వారు ఆరోగ్య సమస్యలతో చిక్కుల్లో పడ్డారు. వీరు మన సైనికుల కంట పడ్డారు. మన సైన్యం ఆ చైనీయులకు ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి కాపాడుకోవడానికి ఉన్ని దుస్తులు ఇచ్చింది. వారు కోలుకున్నాక గమ్యం చేరడానికి సహకరించింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. మానవత్వానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.

ఇదీ మన దేశ గొప్పతనం. ఇదీ మన సైన్యం మానవత్వం. జయహో భారత్! 



Tags:    

Similar News