Covid 19: వచ్చే నాలుగు వారాలు చాలా కీలకం

Covid 19: వైరస్ నియంత్రించుకోవడం ఇంకా మన చేతుల్లోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

Update: 2021-04-06 15:44 GMT

Covid 19:(File Image)

Covid 19: వచ్చే నాలుగు వారాలు కరోనా కట్టడికి అత్యంత కీలకమని, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కిందటేడాది కంటే తీవ్రమైందని కేంద్రం హెచ్చరించింది. నిర్లక్ష్యమే అధ్వాన్న పరిస్థితికి కారణమని హెచ్చరించింది. వైరస్ కిందటేడాది కంటే వేగంగా వ్యాపిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రొఫెసర్ వినోద్ కె పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆయన హెచ్చరించారు. అయితే.. కరోనా నియంత్రణ ఇప్పటికీ మన చేతుల్లోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా ఉంది. గతంలో కంటే వేగంగా వ్యాప్తిస్తోంది. అందుకే కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించడంలో పెరిగిన నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారి తీసింది. వైరస్‌ మరింత విస్తరించేందుకు మనం ఇక ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. నిర్లక్ష్యం వహించకూడదు' అని ప్రొఫెసర్ వీకే పాల్ అన్నారు. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమైన సమయమని వీకే పాల్ అన్నారు. కరోనా వైరస్‌ పరిస్థితిని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో లభించే వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 19 వందల 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల 10వేల 943కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనా బారిన పడి ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం 7వేల 251 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా బారి నుంచి కోలుకొని 835 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 809 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News