Indian airspace closed for Pakistan: పాకిస్థాన్ కు ఇండియా మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ విమానాలను భారత గగనతలంపైకి రావడానికి వీలు లేకుండా నిషేధం విధించింది. పాకిస్థాన్ మిలిటరీ విమానాలతో పాటు ఆ దేశ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ఏ విమానం కూడా ఇక భారత గగనతలంపైకి రావడానికి అనుమతి లేదు. ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుండే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.
ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుండి ఇండియా మీదుగా ఆసియాలోని ఇతర దేశాలకు వెళ్ళే విమానాలకు దూర భారం, ఆర్ధిక భారం, సమయం భారీగా పెరగనుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక వంటి దేశాలకు వెళ్ళే విమానాలు భారత్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
పహల్గం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్ కఠినమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, భారత్ చర్యలకు నిరసనగా పాకిస్థాన్ నాలుగు రోజుల క్రితమే ఇండియా నుండి ఆపరేట్ అయ్యే అన్ని విమానాలకు పాకిస్థాన్ గగనతలంపై నిషేధం విధించింది. పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇండియా నుండి నార్త్ అమెరికా, యూరప్ దేశాలకు విమానాలకు 4 గంటల సమయం ఎక్కువ పడుతోంది. యూరప్ దేశాల్లో విమానాలు ఆగి ఇంధనం నింపుకుని వెళ్లాల్సి వస్తోంది.