Southwest Monsoon: నైరుతి రుతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావం
Southwest Monsoon: మరో 3 రోజుల తర్వాతే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావం
Southwest Monsoon: వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. కేరళ తీరాన్ని మరో మూడు రోజుల తర్వాతే రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో జూన్15 వరకు వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్నికోబార్దీవులను దాటి ప్రస్తుతం బంగాళఖాతంలో కొంత మేరకు ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగిపోయాయి. అరేబియా సముద్రంలో లక్ష దీవులను తాకిన అవి ముందుకు జరగడంలేదు. గత సంవత్సరం జూన్1న కేరళాను తాకి వర్షాలు మొదలైనా ఈ ఏడాది కనీసం శ్రీలంకను కూడా దాటలేదు.
రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల మందగమనానికి ఎల్‌నినో ప్రభావం కూడా కారణమై ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలోని పెరు, ఈక్వెడార్‌ల సముద్ర జలాలు సాధారణం కన్నా ఏడు డిగ్రీలు అదనంగా వేడెక్కి వీచే గాలుల్లో ఒత్తిడి అత్యధికమైంది. దాని ప్రభావం భారత్సమీప సముద్ర జలాలపైనా పడుతోంది.
ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా ఉంటే కరవు ఏర్పడే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, భారత్ వంటి దేశాల్లో 1997-98, 2003, 2015 సంవత్సరాల్లో వర్షాలులేక కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు పంటలు పండించే స్థితిలేక తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో కుంభవృష్టి కురిసి పెరూ, అమెరికా వంటి దేశాల్లో వరదలు వచ్చాయి. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఎల్‌నినో ప్రభావం పడటం ఆనవాయితీగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా జూన్ మొదటివారంలో రుతుపవనాల విస్తరణతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడాలి. ఈ సంవత్సరం రెండు రాష్ట్రాల్లో ఎండలు ప్రజల్ని ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ పరిస్థితి చెప్పలేకుండా పోయింది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఆరంభమయ్యే వరకు రైతులు విత్తనాలు వేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.