IIT Baba: ఆధ్యాత్మికం ముసుగులో వివాదాలు.. ఎవరీ ఐఐటీ బాబా?

IIT Baba: మహాకుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా మరోసారి హల్‌చల్ చేశాడు.

Update: 2025-03-05 05:12 GMT

IIT Baba: ఆధ్యాత్మికం ముసుగులో వివాదాలు.. ఎవరీ ఐఐటీ బాబా?

IIT Baba: మహాకుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా మరోసారి హల్‌చల్ చేశాడు. ఓ హోటల్‌లో గంజాయి సేవించి దొరికి పోయాడు. తాను అఘోరీ బాబానని పుట్టిన రోజు సరదాగా గంజాయి తీసుకున్నానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇటీవలే టీమిండియా ఓడిపోతోందని జోక్యం చెప్పి నాలిక్కరుచుకున్నారీ బాబా.. ఈయన అసలు బాబాయే కాదని కొందరు సాధులు ఆయన్ని టీవీ డిబేట్‌లో నిలదీయడం వైనల్ మారింది. అసలు ఎవరీ ఐఐటీ బాబా అనే చర్చ మొదలైంది.. లక్షల రూపాయ జీతాన్ని వదులుకొని ఎందుకు బాబా అవతారం ఎత్తారు?

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులారిటీ సంపాదించుకున్న అభయ్ సింగ్‌‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన బసచేసిన హోటల్‌లో గొడవ జరుగుతోందని సమాచారం రావడంతో షిప్రాపథ్ స్టేషన్‌పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఐఐటీ బాబా మత్తులో జోగుతూ కనిపించారు. కొద్దిపాటి గంజాయి కూడా దొరకడంతో ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది తక్కువ స్థాయి నేరం కావడంతో పోలీసులు ఐఐటీ బాబాను హెచ్చరించి బెయిల్ మీద విడిచిపెట్టారు.

మరోవైపు పోలీసుల అరెస్టు తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఐఐటీ బాబా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తాను సూసైడ్ చేసుకుంటానన్న వార్తలో నిజం లేదని ఐఐటీ బాబా వివరణ ఇచ్చారు. తనపై పోలీసులు కేసు నమోదు చేయడం నిజమేనని, బెయిలు కూడా మంజూరైందని చెప్పారు. ఐఐటీ బాబా అరెస్టు వార్తల మధ్యే భక్తులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఆసక్తికలిగించింది.

కుంభమేళాలో కనిపించిన దాదాపు ప్రతి బాబా గంజాయి ప్రసాదంగా తీసుకుంటారు. మరి వారందరినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు ఐఐటీ బాబా. ఈ రోజు తన పుట్టిన రోజని, ఆనందంగా ఉండేందుకు గంజాయి సేవించినట్లు తెలిపారు. పైగా పోలీసుల విచారణలో కూడా ఐఐటీ బాబా తాను అఘోరి బాబానని, ఆచారం ప్రకారం గంజాయి సేవించినట్లు పేర్కొనడం విశేషం.

ఐఐటీ బాబా ఒక హోటల్‌లో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తమకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లామని పోలీసులు తెలిపారు. తాను గంజాయి తీసుకున్నట్టు చెప్పాడన్నారు. మరి కొంచెంది గంజాయి కూడా ఉందని.. స్పృహలో లేనప్పుడు తాను ఏదైనా చెప్పి ఉండవచ్చనని ఐఐటీ బాబా చెప్పాడని పోలీసులు తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద గంజాయి కలిగి ఉండటం నేరం. అయితే తక్కువ మొత్తం కావడంతో ఇంటరాగేట్ చేసి బెయిల్ బాండ్‌పై విడుదల చేశామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన ఏదో పోస్ట్ చేశారని, ఆయన సూసైట్ చేసుకోవాలనుకుంటున్నారని బాబా అనుచరులు మాకు సమాచారం ఇచ్చారు. అవసరమైతే ఆయనను పిలిపించి తదుపరి విచారణ జరుపుతాం" అని వెల్లడించారు.

ఇటీవల ఐఐటీ బాబా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో భారత్‌ ఓడిపోతుందని చెప్పి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్‌ అభిమానులు సూచించారు.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు.

ఐఐటీ బాబాపై ఇటీవల కొందరు సాధువులు కర్రలతో దాడి చేయడం కలకలం రేపింది. నోయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్నారాయన. చర్చ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఐఐటీ బాబాతో వారు వాగ్వాదానికి దిగారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నిలదీశారు. వారికి ఐఐటీ బాబా సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. సాధువులు ఆయన్ని వదలలేదు. ఇతను అసలు బాబా కాదని, ధర్మం పట్ల ఒక్క ముక్కకూడా తెలీదని, కేవలం ఏదో ఫెమస్ అయిపోవాలని కాషాయ దుస్తులు ధరించిలేనీపోనీ విధంగా కాంట్రవర్సీలు సృష్టిస్తున్నాడని సాధులు మండిపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కిందపడ్డారు. వెంటే ఐఐటీ బాబా డిబెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనపై సెక్టార్ 126 లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని పోలీస్‌ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించారు ఐఐటీ బాబా. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐఐటీ బాబా అసలు బాబా కాడని, ఆయన సన్యాసం తీసుకొలేదని గాంజా తాగే అలవాటు ఉందని కొంత మంది ప్రచారం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళాలో కనిపించిన ఐఐటీ బాబా రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు అభయ్‌ సింగ్ గ్రేవార్‌. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని ససరోలి గ్రామానికి అభయ్ తండ్రి న్యాయవాది. అభయ్ చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. అభయ్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేశారు. అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఆ తర్వాత ఇహపరమైన బంధాలు తెలుచుకొని ఆధ్యాత్మిక బాట పట్టినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. లక్షల రూపాయల జీతం వదులుకుని బాబాలాగా అవతారమెత్తారు. కుంభమేళాలో ఆయన ప్రత్యేక ఆకర్శనగా కనిపించారు. ఐఐటీ బాబా, ఇంజినీర్‌ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాధిస్తున్నట్లు చెప్పారు ఐఐటీ బాబా.

అభయ్ సింగ్‌కు చెందిన పాత ఫోటో కొన్ని బయటకు వచ్చాయి. తన కళాశాల జీవితాన్ని ఇతర విద్యార్థిలాగే గడిపాడు. అతను తన స్నేహితులతో సరదాగా గడిపిన చిత్రాలు చాలా ఉన్నాయి. అభయ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వీటిని పంచుకున్నాడు. కానీ అతను బాబా అయినప్పటి నుండి, ఆ తర్వాత అతను తన ఫేస్‌బుక్ ఖాతాను చాలా అరుదుగా ఉపయోగించాడు.

అభయ్‌లో మార్పు క్రమక్రమంగా మొదలైంది. సత్యాన్ని అన్వేషిస్తూ ఇంటి నుంచి బయలు దేరాడు. తన కుమారుడు చిన్నప్పటి నుంచి చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదించేవాడని తెలిపారు ఆయన తండ్రి కరణ్ సింగ్. ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మికం గురుంచి మాట్లాడలేదని తెలిపారు. తాము గత ఆరు నెలలుగా కొడుకు కోసం వెతుకుతుండగా కుంభమేళాలో సాధువుగా కనిపించాడని తెలిపారు.

Tags:    

Similar News