Kolkata: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

Kolkata: 9కి చేరుకున్న మృతుల సంఖ్య * లిఫ్ట్‌లో చిక్కుకున్న ఐదుగురు మృతి

Update: 2021-03-09 03:00 GMT

కోల్‌కతా లో అగ్ని ప్రమాదం(ఫైల్ ఫోటో)

Kolkata: పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాజధాని కోల్‌కతాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే కార్యాలయాలకు దగ్గరలోనే ఒక భవనంలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఒక పోలీసు అధికారి, రైల్వే అధికారి, ఓ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. మరో ఇద్దరి మృతదేహాలు లభించలేదని తెలుస్తోంది..

సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో సెంట్రల్ కోల్‌కతాలోని స్ట్రాండ్‌రోడ్‌ రైల్వే కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 25 ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఉపయోగించారు.. మంటలు మరింత వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌కు కరెంట్ నిలిపివేశారు. దాంతో లిఫ్ట్‌లోనే పొగతో ఊపిరాడక ఐదుగురు ఫైర్ సిబ్బంది చనిపోయారు.. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎలివేటర్‌ను వినియోగించడం వల్లే విషాదం చోటు చేసుకుందని నగర పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. దాంతో ప్రమాద సమయంలో లిఫ్ట్ ఉపయోగించడంపై అనుమానాలు వస్తున్నాయి.

అగ్ని ప్రమాద విష‍యం తెలుసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాత్రి 11 గంటల సమయంలో సంఘటనా స్థలానికి పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషాద ఘటనపై తాను రాజకీయాలు చేయాలనుకోవడం లేదని.. కానీ, రైల్వే నుంచి ఎవరూ ఈ ప్రదేశానికి రాలేదని మమతా విమర్శించారు..

స్ట్రాండ్ రోడ్‌లోని హూగ్లీ నది పక్కన తూర్పు రైల్వే, సౌత్ ఈస్ట్రర్న్ రైల్వే కార్యాలయ భవనం న్యూ కోయిలా ఘాట్ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తులో మంటలు చేలరేగాయి. ఈ భవనంలో రైల్వే టికెటింగ్ కార్యాలయాలున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా IRCTC సర్వర్ దగ్ధమైంది.. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఘటన సమయంలో ఎలివేటర్ ను ఎందుకు వినియోగించారనే దానిపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News