కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత.. విషాదంలో పార్టీ శ్రేణులు

Update: 2020-03-09 03:00 GMT

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే గతవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్యలు కూడా తెలెత్తినట్టు వైద్యులు గుర్తించారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. హన్స్‌రాజ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4 గంటలకు నిఘంబోడ్ ఘాట్‌లో జరగనున్నట్లు ఆయన కుమారుడు అరుణ్ భరద్వాజ్ తెలిపారు.

కాగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు హన్స్‌రాజ్ భరద్వాజ్.. కేరళ, కర్ణాటక గవర్నర్‌గా పనిచేసిన భరద్వాజ్ గతంలో కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. హన్స్‌రాజ్ మరణంతో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. భరద్వాజ్ మరణంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. అలాగే ట్విట్టర్ వేదికగా భరద్వాజ్ మరణంపై స్పందించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ సందర్బంగా కుటుంబానికి సానుభూతి తెలిపారు. న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా భరద్వాజ్ మృతికి సంతాపం తెలిపారు.. పార్లమెంటులో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

'భారత న్యాయ మంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేసిన శ్రీ హన్స్‌రాజ్ భరద్వాజ్ మరణానికి ప్రగాడం సంతాపం. మేము పార్లమెంటులో కలిసి ఉన్నాము. ఆయన ఆత్మకు శాంతి కోరుకుంటున్నాను' అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా భరద్వాజ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో మాజీ కేంద్ర న్యాయ మంత్రి మరియు కర్ణాటక , కేరళ మాజీ గవర్నర్ శ్రీ హన్సరాజ్ భరద్వాజ్ మరణంతో షాక్ కు గురయ్యాను. తన కుటుంబానికి బలం చేకూర్చాలని కోరుకుంటున్నట్టు అని ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News