హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 24 గంటల్లో 12మంది మృతి
Himachal Pradesh: 11జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 24 గంటల్లో 12మంది మృతి
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మూడు రోజులుగా కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. జనజీవం అస్తవ్యస్థంగా మారింది. 11 జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్స్ పూర్తిగా మూత పడ్డాయి. ఎమర్జెన్సీ పనుల కోసం బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారింది. రోడ్లపై ఎక్కడ చూసినా వరద ప్రవాహమే కనిపిస్తోంది.. వాగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వేరు వేరు ప్రాంతాలో 12 మంది మృతి చెందారు. చాలా చోట్ల కొండచరియలు కూలి పడ్డాయి. చిన్న చిన్న బ్రిడ్జిలు కూలిపోయాయి..
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో పర్యాటకులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగి పడటం,, మరికొన్ని చోట్ల రోడ్ల ధ్వంసం కావడంతో హైవేపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో కులు కొండ ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక పక్క వర్షం.. మరోపక్క కొండచరియలతో ప్రమాదంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
చండీగఢ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. వరదలతో సుఖ్‌నా లేక్ నిండు కుండలా మారింది. దీంతో లేక్ గేట్లు తెరిచిన అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
కులూలోని ఆని బస్టాండ్ సమీపంలో ప్రకృతి ప్రకోపానికి పలు ఇళ్ళు నేలమట్టమయ్యాయి. భారీ కొండ చరియ కూలిపడటంతో నదీ తీరంలోని ఇళ్లు ఉన్ణ ఫళంగా కూలి పోయాయి. భయ భ్రాంతులకు గురైన స్థానిక ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. భారీ భవనాలు ఒక్కసారిగా కూలడంతో దట్టమైన దుమ్ము అలముకున్నది.. దీంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.