Heavy Rains: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

Heavy Rains: వరద పోటెత్తడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు

Update: 2021-10-19 08:52 GMT
ఉత్తరాఖండ్ లో వరదలు (ఫైల్ ఇమేజ్)

Heavy Rains: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలు ఆగిపోయాయి. కేదర్‌నాథ్‌ టెంపుల్‌కు వెళ్లి వరదలో చిక్కుకున్న భక్తులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు కలిసి కాపాడారు. నందాకిని రివర్‌ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బద్రీనాథ్‌ నేషనల్‌ హైవేకు సమీపంలోని లాంబగడ్‌ నల్లాహ్‌ వద్ద వరదలో చిక్కుకున్న కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.

భారీ వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా మూసివేసింది ఆరాష్ట్ర సర్కార్‌. వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు యాత్రకు వచ్చిన వారు బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ దామి.

జనావాసాల్లోకి ఒక్కసారిగా పోటెత్తింది వరదనీరు. దీంతో వరదలో చిక్కుకున్నవారు ఒడ్డుకు చేరేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వరద ఉధృతికి బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చంపావత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి వరద ఉధృతికి కూలిపోయింది. ఇక వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి.

వర్షాలు, వరదల ధాటికి జనాలు చనిపోతున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వరదలకు ఓ కుటుంబం జలసమాధి అయిపోయింది. 10 డ్యాంల పరిధిలో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు అధికారులు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్టు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News