Gujarat CM: విజయ్‌రూపానీ అనూహ్య రాజీనామాతో వేడెక్కిన రాజకీయాలు

Gujarat CM: గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా * గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించిన రూపానీ

Update: 2021-09-12 01:55 GMT

గుజరాత్ సీఎం విజయ్ రూపాని (ఫైల్ ఇమేజ్)

Gujarat CM: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎలాంటి ప్రత్యేకమైన కారణం చెప్పకుండానే సీఎం విజయ్‌ రూపానీ అకస్మాత్తుగా గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కొత్త నాయకత్వంలో నూతనోత్సాహం, కొత్త శక్తితో గుజరాత్‌ అభివృద్ధి పథంలో మరింతగా దూసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకచ్చారు.

ప్రధాని సొంత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అంత సానుకూలంగా లేవని, ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని అధిష్ఠానానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబరులో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగించి పాలనను సమర్థంగా నిర్వహించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో గుజరాత్‌ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, సీఎం రూపానీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అవి ఢిల్లీ దాకా చేరడంతో సీఎంను మార్చక తప్పలేదని తెలుస్తోంది.

గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ అనూహ్య రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత సీఎం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఊపందుకొంది. ఈ తరుణంలో ప్రధానంగా నలుగురు బీజేపీ సీనియర్‌ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో గుజరాత్‌ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌, వ్యవసాయ శాఖమంత్రి ఆర్‌సీ ఫాల్దుతో పాటు కేంద్రమంత్రులుగా ఉన్న పురుషోత్తం రూపాలా, మన్‌సుఖ్‌ మాండవీయ పేర్లు తెరపైకి వచ్చాయి.

2016 ఆగస్టులో అప్పటి సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామా చేసిన సందర్భంలో కూడా నితిన్‌ పటేల్‌ తదుపరి ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఆఖరి నిమిషంలో విజయ్‌రూపానీకి భాజపా అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది. 2016లో ఆనందిబెన్‌ పటేల్‌ కూడా ఎన్నికలకు ఏడాది ముందే రాజీనామా చేశారు. సరిగ్గా మళ్లీ అదే తరహాలో విజయ్‌ రూపానీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంటుండగానే తన సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

Tags:    

Similar News