DGCA: అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగింపు

DGCA: కేంద్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మరోసారి పొడగించింది.

Update: 2021-06-30 09:28 GMT

International Flights:(DGCA)

DGCA: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పడుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మరోసారి పొడగించింది. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ప్రకటనను విడుదల చేసింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది.

కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్‌, ప్యాసింజర్‌ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా వందే భారత్‌ మిషన్‌ కింద విమానాల సర్వీసులతో స్వదేశానికి తీసుకువచ్చింది. ఆ తర్వాత పలు దేశాలతో ఎయిర్‌ బబుల్‌ కింద పలు దేశాలతో జూలై నుంచి ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపుతోంది.

దీనిలో భాగంగా అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భార‌త్‌ ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపడటంతోపాటు.. స్వదేశంలోకి అనుమతి ఇస్తోంది. భారత్‌లో కొవిడ్‌ విజృంభిస్తుండటంతో 2020 మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణ సేవలు నిలిపివేశారు. గత కొన్నిరోజుల క్రితం కోవిడ్ కేసులు నాలుగు లక్షలకు చేరువలో నమోదు కాగా.. వేలల్లో మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి.


Tags:    

Similar News