ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అసెంబ్లీలో వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. కౌన్సిల్ లో పెండింగ్ లో ఉంది. అయితే ఏపీ నిర్ణయాన్ని మరో రాష్ట్రం ఆదర్శంగా తీసుకుంది.
ఉత్తర ప్రదేశ్ నుండి విడిపోయి కొండప్రాంత రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్‌కు రెండు దశాబ్దాల తరువాత శాశ్వత వేసవి రాజధాని లభిస్తుంది. చమోలి జిల్లాలోని గైర్సేన్ వద్ద బడ్జెట్ ప్రసంగం చేస్తూ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బుధవారం ఈ ప్రకటన చేశారు. దీంతో ఉత్తరాఖండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా డెహ్రాడూన్, జ్యుడీసియల్ రాజధానిగా నైనిటాల్, వేసవి రాజధానిగా గైర్సేన్ కొనసాగనున్నాయి.
రాష్ట్ర రాజధాని అయిన డెహ్రాడూన్ నుండి 280 కిలోమీటర్ల దూరంలో గార్హ్వాల్‌లో ఉన్న గైర్‌సైన్ వద్ద రాజధాని ఉండాలని స్థానికుల నుంచి చాలాకాలంగా డిమాండ్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువగా డెహ్రాడూన్‌లో జరుగుతుంటాయి, అయితే అప్పుడప్పుడు సెషన్‌లు - ప్రస్తుత బడ్జెట్ సెషన్ లాగా - గైర్సేన్‌లో జరుగుతాయి. అనేక జిల్లాలకు దూరంగా ఉన్న డెహ్రాడూన్ ను అలాగే ఉంచి గైర్సేన్ కూడా మరొక శాశ్వత రాజధానిగా ఎంపిక చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
అయితే చాలా మంది ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోలేదు. త్రివేంద్ర సింగ్ రావత్ మాత్రం ప్రజల కోరిక నెరవేర్చారు. ఈ సందర్బంగా తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. తన గత రాత్రి(మంగళవారం) ఉత్సాహంతో నిద్రపట్టలేదని.. గైర్సేన్‌ను వేసవి రాజధానిగా ప్రకటించబోతున్నానని ఎవరితోనూ పంచుకోలేదు. (రాష్ట్ర) ఉత్తరాఖండ్ కోసం అమరవీరులైన వందలాది మందికి ఈ నిర్ణయాన్ని అంకితం చేస్తున్నాను అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఒకే స్ట్రోక్‌తో, రావత్ తన పూర్వీకులు చేయలేనిది చేయగలిగాడు. మాజీ సిఎం, బిజెపి సీనియర్ నాయకుడు విజయ్ బహుగుణ, 2012 లో గైర్సేన్ వద్ద కేబినెట్ సమావేశం నిర్వహించాలని మొదట నిర్ణయించారు. బహుగుణ స్థానంలో 2014 లో కాంగ్రెస్ కు చెందిన హరీష్ రావత్ వచ్చినా, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను గుడారాలలో నిర్వహించారే తప్ప రాజధాని నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆయన అసెంబ్లీ భవనం నిర్మించడానికి మాత్రం బడ్జెట్ కేటాయించారు.
అయితే, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఇందిరా హృదయేష్ ఈ చర్యను రాజకీయంగా ప్రేరేపించారని పేర్కొన్నారు. గైర్సేన్ కోసం రాష్ట్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయింపు కూడా లేదు. ఇది పెద్ద జోక్ అని అభివర్ణించారు.
ఇదిలావుండగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి నాయకులు ప్రశంసించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు, నైనిటాల్ ఎంపి అజయ్ భట్ మాట్లాడుతూ 2017 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి ఈ వాగ్దానం చేసిందని గుర్తుచేశారు.